ఔరా బావా ఏం గిఫ్ట్ ఇస్తివి!

Sun Jun 23 2019 13:21:29 GMT+0530 (IST)

ఇండస్ట్రీలో హీరోల స్నేహాల గురించి తెలిసిందే. స్టార్ హీరోల మధ్య సఖ్యత గురించి ఇప్పటికే ఆసక్తికర చర్చ సాగుతోంది. కుటుంబ సమేతంగా హీరోలంతా ఫార్టీలు చేసుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ఇకపోతే స్టార్ హీరో అల్లు అర్జున్ తో నవదీప్ స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. కలిసి ఆర్య .. ఆర్య 2 చిత్రాల్లో నటించారు. ఆ ఇద్దరి మధ్యా స్నేహంలో చనువెంత? అంటే బావా అంటే బావా అని పిలుచుకునేంత. ఒకరినొకరు సర్ ప్రైజ్ కానుకలిచ్చి ఆశ్చర్యపర్చుకునేంత స్నేహం ఉంది.తాజాగా నవదీప్ తన స్నేహితుడు అల్లు అర్జున్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంతకీ ఏమిటా గిఫ్ట్ అంటే ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ బొమ్మ. చూడగానే హత్తుకుపోయేలా కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని ఏ మెటీరియల్ తో చేశారో కానీ జీవం ఉట్టి పడుతోంది. అలాగే ఈ గెటప్ ఎక్కడో చూశామని అనుకుంటున్నారా?  `రుద్రమదేవి` చిత్రంలో గోనగన్నారెడ్డిని మర్చిపోవడం అంత తేలిగ్గా కుదురుతుందా? ఎందుకంటే ఆ సినిమాలో అత్యంత ఆదరణ పొందిన పాత్ర అది. రుద్రమదేవిని ఆర్థిక పరమైన చిక్కుల నుంచి బయటపడేయడంలో సాయమైన పాత్ర కూడా అదే. బన్ని నటనకు అవార్డులు రివార్డులు దక్కాయి. బంధిపోటు గన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఆహార్యం.. డైలాగులు తెలుగు జనం  మర్చిపోలేరు.

నేను తెలుగుభాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా!! అంటూ సెంటిమెంటును రగిలించిన బన్ని డైలాగ్ అసలే మర్చిపోలేం. అందుకే గన్నారెడ్డి వేషధారణలో ఉన్న స్టాట్యూని చేయించి నవదీప్ బన్నీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇటీవల తను అందుకున్న స్వీటెస్ట్ గిఫ్ట్ ఇదేనని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఔరా బావా ఎంత మంచి గిఫ్టిచ్చావ్? అంటూ ఫ్యాన్స్ సైతం సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇక నవదీప్ కెరీర్ డైలమాలో ఉన్న ప్రతిసారీ బన్ని ఏదో ఒక రూపంలో అతడికి అవకాశాలిస్తుంటాడన్న సంగతి తెలిసిందే.