షాకింగ్: నేచురల్ స్టార్ డబుల్ గేమ్

Thu Jan 24 2019 14:49:25 GMT+0530 (IST)

నిర్మాత అంటే పది మందికి అన్నం పెట్టేవాడు. తాను ఆకలితో ఉన్నా అందరికీ వేడి వేడి బిరియానీ ఏర్పాటు చేస్తాడు! అందుకే ఎందరు నిర్మాతలు వచ్చినా ఎంకరేజ్ చేయాలి. నేచురల్ స్టార్ నాని నిర్మాత అవుతుంటే కాదని అనగలమా?  వెల్ కం టు నాని.  వరుణ్ సందేశ్.. సందీప్ కిషన్ కలయికలో బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ నిడిమోరు కృష్ణ డి.కె సంయుక్తంగా నిర్మించిన `డీ ఫర్ దోపిడి` నిర్మాణ భాగస్వామిగా తొలి అడుగు వేసిన నేచురల్ స్టార్ ఆ తరువాత కొంత విరామం ఇచ్చి `అ!` చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి మంచి మార్కులే వేయించుకున్న నాని మరోసారి నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడు. చెత్త సినిమాతో దెబ్బ తిని మంచి సినిమాతో పేరు తెచ్చుకుని ఇప్పుడు తెలివైన అడుగులు వేస్తున్నాడట. త్వరలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి నాని సినిమాలు నిర్మిస్తారట.`మళ్లీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో `జర్సీ` అనే చిత్రంలో నటిస్తున్నారు నాని.  ఈ చిత్రంలో అతడు విభిన్నమైన పాత్రలో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత విక్రమ్ కె కుమార్ చిత్రాన్ని అంగీకరించిన నేచురల్ స్టార్ త్వరలో సినిమాల నిర్మాణంపై పూర్తిగా దృష్టి సారిస్తున్నాడట. ఆసక్తికరంగా ఈ రెండు చిత్రాల్లోనూ నానినే హీరోగా నటిస్తారు. కాగా ఈ రెండు చిత్రాల్లో ఒక చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనుండగా మరో చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు నిర్మాతలతో నాని ఒప్పందం కుదుర్చుకున్నారని ఇవి త్వరలోనే సెట్స్ మీదికి రానున్నాయని అందులో ఒక చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించనున్నారని తెలిసింది.

మహేష్ చరణ్ బన్ని ప్రభాస్ రానా వంటి స్టార్ హీరోలు నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. కొందరు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా సినీనిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. హీరోలు నిర్మాతలు అవ్వడం అన్న ట్రెండ్ మంచిదే. అందులో కష్టం నష్టం లోటు పాట్లు తెలుస్తాయి. నవతరంలో స్పీడ్ మీదున్న నాని శర్వానంద్ వంటి హీరోలు ఈ అనుభవాన్ని చాలా ఎర్లీగానే చూస్తున్నారు. ఫ్లాప్.. హిట్టు అనుభవంతో ముచ్చటగా మూడోసారి సినిమా నిర్మిస్తున్నాడు నాని. భవిష్యత్ కాంపిటీషన్ ని ఎదుర్కోవాలన్నా పునాదుల్ని బలంగా వేయాలన్నా నానీలా హీరోలు నిర్మాతలు అయ్యి తీరాల్సిందే!!