Begin typing your search above and press return to search.

బాహుబలి తమిళ సినిమా అటండీ..

By:  Tupaki Desk   |   29 April 2017 10:00 AM GMT
బాహుబలి తమిళ సినిమా అటండీ..
X
ఉత్తరాది వాళ్లకు మామూలుగానే సౌత్ అంటే చిన్నచూపు. అందులోనూ తెలుగు వాళ్లంటే మరీనూ. సౌత్ సినిమా అంటే తమిళ సినిమానే అన్న అభిప్రాయంతోనే వాళ్లు ఇన్నాళ్లూ ఉంటూ వచ్చారు వాళ్లు. కొన్నేళ్ల కిందటి వరకు సౌత్ ఇండస్ట్రీలో తమిళ సినిమానే ఆధిపత్యం అన్న సంగతి అంగీకరించాల్సిన విషయమే. మణిరత్నం.. శంకర్ లాంటి దర్శకులు తమిళ సినిమాను తీసుకెళ్లి ఎక్కడో నిలబెట్టేసిన మాట వాస్తవం. కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా గత కొన్నేళ్లలో ఎన్నో మెట్లు ఎక్కేసింది. మగధీర.. ఈగ లాంటి సినిమాలతో తెలుగు సినిమా ప్రమాణాల్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ‘బాహుబలి’తో ఏకంగా శిఖరాన్ని అధిరోహించాడు. బాలీవుడ్ వాళ్లకు కూడా అందనంత ఎత్తులో తెలుగు సినిమాను నిలబెట్టాడు.

కానీ ఈ క్రెడిట్ ఇప్పుడు తమిళులకు కట్టబెట్టేస్తోంది నేషనల్ మీడియా. ‘బాహుబలి’ని తమిళ సినిమా అని నేషనల్ మీడియా సంబోధిస్తుండటం వారి అవగాహన లేమికి నిదర్శనం. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైనపుడు ఇలాగే చేసి చీవాట్లు తిన్న జాతీయ మీడియా ఇప్పుడు కూడా తన అజ్నానాన్ని మరోసారి బయటపెట్టుకుంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేసిన నేపథ్యంలో టైమ్స్ నౌ ఛానెల్ చేపట్టిన చర్చలో భాగంగా ‘బాహుబలి’ తమిళంలో తెరకెక్కి తెలుగు.. మలయాళం.. హిందీ భాషల్లోకి అనువాదం అయిందని పేర్కొన్నారు. ఈ చర్చకు వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ సినీ క్రిటిక్స్ వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేశారు. రాజమౌళి నేపథ్యమేంటి.. అతను ఇంతకుముందు ఎక్కడ సినిమాలు తీశాడు.. ప్రభాస్ ఎక్కడి వాడు.. రానా ఎక్కడివాడు.. కీరవాణి.. విజయేంద్ర ప్రసాద్ ల సంగతేంటి.. ‘బాహుబలి’ షూటింగ్ ఎక్కడ జరుపుకుంది.. ఈ విషయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా.. ‘బాహుబలి’ తమిళ సినిమా అనే సాహసం చేయరు. ఇంత అవగాహన రాహిత్యంతో ఉన్న నేషనల్ మీడియా మన గురించి ఏదైనా రిపోర్ట్ చేస్తే ఎలా నమ్మగలం?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/