అత్యాచార ఘటనలు.. బాలీవుడ్ లెజెండ్ షాక్

Tue Apr 24 2018 14:24:23 GMT+0530 (IST)

దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఇలాంటి ఘటనలు మీడియా ద్వారా వెలుగు చూస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల గురించి బయటికి తెలియాలని.. అప్పుడే చైతన్యం వస్తుందని.. సమాజంలో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కఠువా బాలిక హత్యాచారం ఘటనపై తన అభిప్రాయం అడిగిన మీడియా వాళ్లతో నసీరుద్దీన్ మాట్లాడారు. దేశంలో అత్యాచారాలఘటనలు కొత్తవి కాదని.. ఇలాంటి ఘటనలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయని.. ఐతే ఇప్పుడు ఆ కేసు మీడియాలో వెలుగులోకి రావడం శుభపరిణామమని ఆయన అన్నారు.అత్యాచార బాధితులు గతంలో బయటికి రావడానికి.. తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి భయపడేవాళ్లని.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని నసీరుద్దీన్ అన్నారు. ‘నేను ఎందుకు నా ముఖాన్ని దాచి పెట్టుకోవాలి... నేరం చేసిన వాడు సిగ్గుతో తన తల దించుకోవాలి’ అంటూ ఓ అత్యాచార బాధితురాలు ప్రశ్నించడం గురించి పత్రికల్లో చదివి తాను ఆశ్చర్య పోయానని నసీరుద్దీన్ షా అన్నారు. ఉదయాన్నే పేపరు తెరవగానే అత్యాచార ఘటనల గురించి వార్తలు కనిపిస్తున్నాయని..దీనిపై మనం చర్చించడం మంచి పరిణామమని ఆయన చెప్పారు. తరాలు మారుతుంటే మనుషుల ఆలోచన విధానం మారుతుందని.. ఐతే ఈ అత్యాచారాల పర్వాన్ని రాత్రికి రాత్రే ఆపడం మాత్రం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.