Begin typing your search above and press return to search.

నారా రోహిత్ సినిమా.. మళ్లీ!

By:  Tupaki Desk   |   20 Aug 2017 7:30 AM GMT
నారా రోహిత్ సినిమా.. మళ్లీ!
X
టైటిల్ లోగో.. భలే ఉందే అనిపించింది. ఫస్ట్ లుక్ ఆశ్చర్యానికి గురి చేసింది. టీజర్ సూపర్బ్ అన్నారు. ట్రైలర్ కూ మంచి రెస్పాన్సొచ్చింది. మొత్తంగా నారా రోహిత్ కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’కి అన్నీ సానుకూలంగానే కనిపించాయి. సినిమా మీద జనాల్లో బాగానే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారంతా. కానీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ వాయిదా పడుతుండటం నిరాశ కలిగిస్తోంది. జూన్ నెలాఖర్లోనే రావాల్సిన ‘కథలో రాజకుమారి’ ఇప్పటిదాకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. చివరికి ఆగస్టు 25న రిలీజ్ పక్కా అని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఆ రోజు సినిమా పక్కా అనుకుంటుంటే.. ఇప్పుడు మళ్లీ వాయిదా వార్తలు వినిపిస్తున్నాయి.

కారణాలేంటన్నది తెలియడం లేదు కానీ.. వచ్చే శుక్రవారం కూడా ‘కథలో రాజకుమారి’ విడుదల కావట్లేదన్నది తాజా సమాచారం. వినాయకచవితి వీకెండ్ లో సినిమాను రిలీజ్ చేసుకోవడానికి మంచి అవకాశమున్నా సద్వినియోగం చేసుకోలేదు ఈ చిత్ర బృందం. ఆ రోజు ‘అర్జున్ రెడ్డి’ మినహాయిస్తే తెలుగు సినిమాల నుంచి పోటీ లేదు. తమిళ డబ్బింగ్ సినిమాలు వివేకం.. వీఐపీ-2 కూడా రిలీజవుతున్నప్పటికీ వాటి ప్రభావం నామమాత్రం. మరి ‘కథలో రాజకుమారి’కి ఏం ఇబ్బందొచ్చిందో ఏమిటో? సెప్టెంబర్లో చూస్తే మొత్తం ప్యాక్ అయిపోయి ఉంది. తొలి రెండు వారాల్లో ‘పైసా వసూల్’తో పాటు ‘యుద్ధం శరణం’.. ‘ఒక్కడు మిగిలాడు’.. ‘మేడమీద అబ్బాయి’ షెడ్యూల్ అయి ఉన్నాయి. చివరి రెండు వారాల్లో ‘జై లవకుశ’.. ‘స్పైడర్’.. ‘మహానుభావుడు’ రానున్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య ‘కథలో రాజకుమారి’కి చోటు దక్కుతుందేమో చూడాలి. మరోవైపు రోహిత్ కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ కూడా విడుదలకు సిద్ధమైపోవడం విశేషం.