Begin typing your search above and press return to search.

నారా హీరో వార్ మూవీ

By:  Tupaki Desk   |   24 Jun 2018 1:29 PM GMT
నారా హీరో వార్ మూవీ
X
రంగస్థలం ప్రభావమో లేక కాల మహిమో కానీ ఈ మధ్య హీరోలతో పాటు దర్శకులు అందరూ పీరియాడిక్ సినిమాల వైపు మళ్లుతున్నారు. 80వ దశకాన్ని నేపధ్యంగా తీసుకుని రామ్ చరణ్ హిట్ కొట్టిన నేపధ్యంలో ఇలాంటివి సరిగ్గా తెరకెక్కిస్తే కాసుల వర్షం కురిపిస్తాయని అర్థం కావడంతో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. శర్వానంద్ చేస్తున్న విరాటపర్వం(వర్కింగ్ టైటిల్)కూడా ఇదే కోవలో రానుండగా రానా చేస్తున్న మరో సినిమా కూడా స్వాతంత్ర పోరాటాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుంటోంది. నీదా నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల తీయబోయే రెండో సినిమా కూడా 90 దశకంనాటి పొలిటికల్ సెటప్ లో ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. కథ విని సాయి పల్లవి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

ఇప్పుడు ఈ సిరీస్ ను తాను మాత్రం ఎందుకు వదలాలని డిసైడ్ అయ్యాడు నారా హీరో రోహిత్. జయాపజయాలతో సంబంధం తన మానాన తాను నచ్చిన కథలతో సినిమాలు వరసగా చేసుకుంటూ పోతున్న రోహిత్ కు దర్శకుడు చైతన్య చెప్పిన 1971 కాలం నాటి కథ నచ్చడంతో దాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. కాకపోతే బడ్జెట్ 15 కోట్లకు పైగా అవుతుందని లెక్క తేలడంతో వద్దని సన్నిహితులు వారిస్తున్నా మంచి సబ్జెక్ట్ వదులుకున్నట్టు అవుతుందని తీయడానికి సిద్ధ పడినట్టు సమాచారం. ఈ ఏడాది భాగమతి బంగళాతో అందరిని భయపెట్టిన ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర నేతృత్వంలో పనులు కూడా మొదలయ్యాయని వినికిడి. రాజీ పడకుండా కథ డిమాండ్ మేరకు ఎంత సీనియర్ ఆర్టిస్టులైనా పారితోషికం విషయంలో లెక్కలు వేసుకోకుండా ముందుకు వెళ్లాలని రోహిత్ డిసైడ్ అయినట్టు తెలిసింది.

ఇప్పటి దాకా చిన్న సినిమాల నిర్మాణానికే పరిమితమైన రోహిత్ దీని ద్వారా బిగ్ మూవీస్ లీగ్ లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. చూస్తుంటే సెల్ ఫోన్ టెక్నాలజీ గోల లేని సరికొత్త అనుభూతి ఇచ్చే సినిమాలు ముందు ముందు చాలానే వచ్చేలా ఉన్నాయి. ఇలా అయితే విభిన్నా కథా చిత్రాలు ఆశించే ప్రేక్షకులకు పండగే