బాలయ్య నటన.. బ్రాహ్మణి కామెంట్

Mon Jun 18 2018 13:00:01 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు పబ్లిక్ లో కినిపించడం.. ఆయన గురించి మాట్లాడటం అరుదు. ఒకవేళ మాట్లాడినా సినిమాల ప్రస్తావన అసలే ఉండదు. ఐతే తాజాగా బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన తండ్రి నటన గురించి మాట్లాడటం విశేషం. బాలయ్యకు ఆమె పెద్ద కాంప్లిమెంటే ఇచ్చింది.బాలయ్య లాంటి సృజనాత్మక నటుడిని తాను ఇంకెక్కడా చూడలేదని బ్రాహ్మణి కామెంట్ చేసింది. బాలయ్య ఒక స్క్రిప్టును నమ్మాడంటే ఇంకేమీ ఆలోచించడని.. ఏమాత్రం రాజీ లేకుండా ఆ సినిమా చేయడానికి.. ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తాడని బ్రాహ్మని చెప్పింది. అలాగే తన తండ్రి నిజ జీవితంలో ఎప్పుడూ నటించరని.. చాలా స్వచ్ఛంగా ఉంటారని ఆమె పేర్కొంది. తన తండ్రి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం తామందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పింది.

ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో బ్రాహ్మణి.. బాలయ్యకు సినిమాలతో పాటు రాజకీయాలంటే కూడా ఎంతో కమిట్మెంట్ ఉందని.. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉందని చెప్పింది. తన తండ్రితో తనది చాలా లోతైన అనుబంధం అని.. ఆయన గొప్ప తండ్రి అని కితాబిచ్చింది బ్రాహ్మణి. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన బ్రాహ్మణి.. ప్రస్తుతం హెరిటేజ్‌తో పాటు కుటుంబానికి సంబంధించిన వ్యాపార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.