Begin typing your search above and press return to search.

ట్రైలర్ ఇంట్రెస్టింగే కానీ..

By:  Tupaki Desk   |   16 Aug 2017 10:40 AM GMT
ట్రైలర్ ఇంట్రెస్టింగే కానీ..
X
ఆ మధ్య ‘నెపోలియన్’ అంటూ ఓ డిఫరెంట్ టీజర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తన నీడను కోల్పోయానంటూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కు రావడం.. ముందు తేలిగ్గా తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత నిజంగానే అతడి చుట్టూ నీడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోవడం.. ఇలా కొంచెం విభిన్నంగా కనిపించిందా టీజర్. ఇప్పుడా టీజర్ కు ఎక్స్ టెన్సన్... అంటే ట్రైలర్ వచ్చింది. అది కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది.

తన నీడ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ కు వచ్చి.. అందరినీ కన్ఫ్యూజ్ చేసిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత తనకు దేవుడు కనిపించాడని.. ఏదో యాక్సిడెంట్ అంటూ క్లోజ్ చేసిన ఓ కేసు గురించి ప్రస్తావించి.. అది హత్య అని చెప్పాడని అంటాడు. ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషనే అతడి నివాసం అవుతుంది. ఇతడి నీడ పోవడం.. దేవుడు మాట్లాడటం.. దీని గురించి పోలీసుల అన్వేషణ మొదలవుతుంది. పోలీసులు.. మీడియా అందరి దృష్టీ అతడి మీదే ఉంటుంది. ఇంతకీ ఈ నీడ పోవడమేంటి.. దేవుడు అతడితో మాట్లాడటమేంటి అన్నది మిగతా కథన్నమాట.

టీజర్.. ట్రైలర్ చూస్తే సినిమా విభిన్నంగా ఉంటుందన్న ఫీలింగ్ అయితే కలిగిస్తున్నాయి. కాకపోతే ఇందులో హీరో సహా ఎవరూర పేరున్న నటీనటులు లేకపోవడమే మైనస్ గా కనిపిస్తోంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ను కొంచెం పరిచయమున్న హీరోతో చేస్తే బాగుండేదేమో అనిపిస్తోంది. నారా రోహిత్ ‘ప్రతినిధి’ సినిమాకు కథ అందించిన ఆనంద్ రవి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తుండటమే కాదు.. తనే హీరోగా కూడా నటిస్తున్నాడు. మరి జనాలకు ఏమాత్రం పరిచయం లేని ఈ నటుడు.. కేవలం కాన్సెప్ట్ తో ఆకర్షించి థియేటర్లకు రప్పిస్తాడా అన్నదే చూడాలి.