Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'నన్ను దోచుకుందువటే'

By:  Tupaki Desk   |   21 Sep 2018 8:27 AM GMT
మూవీ రివ్యూ : నన్ను దోచుకుందువటే
X
చిత్రం : 'నన్ను దోచుకుందువటే'

నటీనటులు: సుధీర్ బాబు - నభా నటేష్ - నాజర్ - పృథ్వీ - తులసి - సుదర్శన్ - వైవా హర్ష - జీవా - జబర్దస్త్ వేణు తదితరులు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాత: సుధీర్ బాబు
రచన - దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు

ఒడుదొడుకులతో సాగుతున్న సుధీర్ బాబు కెరీర్ ‘సమ్మోహనం’తో కొంచెం గాడిన పడింది. నటుడిగా ఈ సినిమా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు.. మంచి విజయం కూడా సాధించింది. ఇప్పుడు సుధీర్ నుంచి వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ ప్రోమోలతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సుధీర్ నిర్మాత కూడా. ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కార్తీక్ (సుధీర్ బాబు) ఒక ఐటీ కంపెనీలో మేనేజర్. ఛండశాసనుడిలా కనిపించే కార్తీక్ అంటే అతడి టీంలోని వాళ్లందరికీ హడల్. పని తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా అతడి జీవితం సాగుతుంటుంది. తన కుటుంబాన్ని కూడా అతను పట్టించుకోడు. ఇలాంటి స్థితిలో అతడికి మరదలితో పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (నాజర్). మరదలు వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని తెలిసి.. ఈ పెళ్లి తప్పించడానికి తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతాడు కార్తీక్. కాలేజీలో చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేసే మేఘన (నభా నటేష్) కార్తీక్ తండ్రిని నమ్మించడానికి అతడి ప్రేయసిగా నటించడానికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో ఆమె కార్తీక్ కు దగ్గరవుతుంది. కార్తీక్ కూడా ఆమెను ఇష్టపడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయరు. ఇద్దరూ దూరమవ్వాల్సిన పరిస్థితి కూడా తలెత్తుంది. మరి వీళ్లిద్దరూ ఎలా కలిశారన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘నన్ను దోచుకుందువటే’ సింపుల్ గా సాగిపోయే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. అనుకోకుండా పరిచయమై ప్రేమలో పడే ఒక జంట.. వారి మధ్య అపార్థాలు.. ఆపై ఇద్దరూ కలిసిపోయే ఒక సగటు కథతోనే ఇది తెరకెక్కింది. ఐతే కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు ఈ ప్రెడిక్టబుల్ స్టోరీని ఉన్నంతలో ఆసక్తికరంగానే చెప్పాడు. హీరో హీరోయిన్ల నేపథ్యాలు ఈ కాలానికి తగ్గట్లుగా.. యువత బాగా కనెక్టయ్యేలా ఉండటం.. ఆ నేపథ్యాల్ని వినోదాత్మకంగా చూపించడం ‘నన్ను దోచుకుందువటే’లో అతి పెద్ద ప్లస్ పాయింట్స్. కాలక్షేపానికి ఢోకా లేదనిపించే ఈ చిత్రం ప్రత్యేకమైన అనుభూతినైతే కలిగించదు. కొత్తదనం లేని కథ.. అక్కడక్కడా కొంచెం నెమ్మదిగా సాగే కథనం దీనికి మైనస్ అయ్యాయి.

కథ కొత్తగా లేకపోయినా.. కథనంలో కొంచెం వైవిధ్యం చూపించగలిగితే.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వినోదం పండించగలిగితే చాలని నమ్మాడు డెబ్యూ డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు. ఇందులో హీరో ఐటీ కంపెనీ మేనేజర్. హీరోయినేమో కాలేజీలో చదువుతూ షార్ట్ ఫిలిమ్స్‌ లో నటించే అమ్మాయి. ఇవి రెండూ కూడా ట్రెండీగా ఉండటం.. ఈ పాత్రలకు సంబంధించి ఆసక్తికర సెటప్ తో సన్నివేశాలు రాసుకోవడం కలిసొచ్చింది. మరీ స్ట్రిక్ట్ గా ఉంటూ తన కింది స్థాయి ఉద్యోగుల్ని వేయించుకునే తినే బాస్ గా సుధీర్ పాత్ర ఆరంభంలో సినిమాపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వినోదం పంచుతాయి. ఆ తర్వాత హీరోయిన్ పాత్ర ప్రవేశంతో కథనం మరింత ఊపందుకుంటుంది. సినిమాలో అతి పెద్ద విశేషం హీరోయిన్ పాత్ర.. ఆ పాత్రలో కొత్తమ్మాయి నభా నటేష్ నటనే అంటే అతిశయోక్తి కాదు.

హీరోయిన్ పాత్రపై దృష్టిపెడితే.. సినిమాకే బలం వస్తుందని దర్శకుడు గుర్తించాడు. ఆ పాత్రను కొంచెం కొత్తగా చూపించాడు. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ తాను పెద్ద ఆర్టిస్టునని ఫీలైపోయే అమ్మాయిగా నభా నటేష్ ఆకట్టుకుంది. ప్రథమార్ధాన్ని ఈ క్యారెక్టరే నడిపించింది. పాత్రకు తగ్గట్లు నభా నటన కూడా బాగా కుదరడంతో ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ మెప్పిస్తాయి. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చే షార్ట్ ఫిలిం షూటింగ్ సీన్ బాగా పేలింది. కథలో పెద్దగా మలుపులేమీ లేకపోయినా.. సన్నివేశాలు చకచకగా సాగిపోవడంతో ప్రథమార్థంలో ఈజీగా టైంపాస్ అయిపోతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాకులేమీ లేకుండా.. సందర్భానుసారంగా వినోదం పండించడం మెప్పిస్తుంది.

ఐతే అసలు కథ చెప్పాల్సి వచ్చినపుడు చాలామంది కొత్త దర్శకుల్లో కనిపించే తడబాటునే ఆర్.ఎస్.నాయుడు కూడా చూపించాడు. అతడి పట్టు కూడా కామెడీ మీదే ఉండటంతో.. కొంచెం సీరియస్ గా సాగే ద్వితీయార్ధంలో బలహీనతలు బయటపడ్డాయి. ఒక దశ దాటాక కథ ముందుకే సాగదు. ప్రథమార్ధంలో ప్రత్యేకంగా అనిపించే హీరోయిన్ పాత్రను రెండో అర్ధంలో తేల్చేశారు. ఆ పాత్రకు ఒక వ్యక్తిత్వం లేనట్లు కనిపిస్తుంది. హీరో తనను తిరస్కరించినా ఆమెలో దాని తాలూకు బాధ ఏమీ కనిపించదు. ఎంత లైట్ హార్టెడ్ పర్సన్ అయినా.. అసలేమీ పట్టనట్లు ఉండటంలో లాజిక్ కనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య దూరం పెరగడానికి దారి తీసే సన్నివేశాలు కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఐతే ప్రి క్లైమాక్స్ తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటు మాత్రం బాగా పండింది. నాజర్ తన అనుభవంతో ఈ ఎపిసోడ్ ను నిలబెట్టారు. ముగింపులో దర్శకుడు మళ్లీ తన బలాన్ని నమ్ముకున్నాడు. ఒక సరదా సన్నివేశంతో సినిమాకు తెరదించాడు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘నన్ను దోచుకుందువటే’ టైంపాస్ చేయడానికి ఓకే అనిపించే ఒక సింపుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.

నటీనటులు:

‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబు మరోసారి సటిల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇంతకుముందులా కాకుండా అతను ఆత్మవిశ్వాసంతో నటించాడు. భావోద్వేగాలు లోలోన దాచుకుని పైకి చాలా టఫ్ గా కనిపించే పాత్రలో సుధీర్ మెప్పించాడు. ఎక్కడా ఎగ్జైట్ కాకుండా నటించడం ఆకట్టుకుంటుంది. చివర్లో వచ్చే సెంటిమెంటు సీన్లో మినహాయిస్తే సుధీర్ బాబు అంతటా బాగానే చేశాడు. షార్ట్ ఫిలింలో నటించే నటించే సీన్లో అతడి నటన బాగా నవ్విస్తుంది. హీరోయిన్ నభా నటేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. తెలుగులో తొలి సినిమా అయినా.. ఏ తడబాటూ లేకుండా కాన్ఫిడెంటుగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పాత్ర కూడా బాగుండటంతో నభా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేస్తుంది. మధ్యలో వదిలేశారు కానీ.. ఈ పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. నాజర్ కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తన అనుభవం చూపించారు. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ లో ఆయన నటన గుర్తుండిపోతుంది. తులసి కూడా బాగానే చేసింది. వైవా హర్ష నవ్వించాడు. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

కంటెంట్ పరంగా జస్ట్ ఓకే అనిపించే సినిమాల్లో పాటలు బాగుండటం చాలా అవసరం. కానీ ‘నన్ను దోచుకుందువటే’కు మ్యూజిక్ బలం కాలేకపోయింది. ఇలాంటి రొమాంటిక్ కామెడీలకు తగ్గ సంగీతాన్ని అజనీష్ లోక్ నాథ్ సమకూర్చలేకపోయాడు. పాటలు మామూలుగా అనిపిస్తాయి. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా.. కొన్ని చోట్ల మరీ లౌడ్ గా అనిపిస్తుంది. మామూలుగా సాగే సన్నివేశాల్లో కూడా నేపథ్య సంగీతంతో ఏదో జరిగిపోతున్న ఫీల్ కలిగించే ప్రయత్నం చేయడం చిరాకు పెడుతుంది. సన్నివేశాల్లో ఉన్న సింప్లిసిటీ సంగీతంలో లేకపోయింది. సురేష్ రగుతు ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. కెమెరా పనితనం సినిమా శైలికి తగ్గట్లుగా సాగింది. సుధీర్ బాబు సంస్థ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేసింది. ఇక ఆర్.ఎస్.నాయుడు సిచ్యువేషనల్ కామెడీతో తాను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడినని చాటాడు. అతను హడావుడి లేకుండా సటిల్ గా కామెడీ పండించిన విధానం ఆకట్టుకుంటుంది. కానీ తొలి సినిమా కోసం అతను ఎంచుకున్న కథ మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. కథలోనూ కొత్తదనం చూపించగలిగితే అతను తనదైన ముద్ర వేయగలిగేవాడు.

చివరగా: నన్ను దోచుకుందువటే.. టైంపాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre