Begin typing your search above and press return to search.

నాని మ‌ళ్లీ డాల‌ర్లు కురిపిస్తాడా?!

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:54 AM GMT
నాని మ‌ళ్లీ డాల‌ర్లు కురిపిస్తాడా?!
X
ఓవ‌ర్సీస్‌లో నాని మార్కెట్ మామూలుగా లేదు. మొద‌ట్నుంచీ అక్క‌డ నాని సినిమాల‌కి డాల‌ర్ల వ‌ర్షం కురుస్తోంది. వినోదాత్మ‌క చిత్రాల్నే ఎక్కువ‌గా చేస్తుండ‌డంతో నానికి స్టార్ క‌థానాయ‌కుల రేంజిలో ఓవ‌ర్సీస్ మార్కెట్ ఏర్ప‌డింది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో అయితే ఇక పీక్స్‌కి వెళ్లాడు నాని. మారుతి క్రేజ్ కూడా తోడు కావ‌డంతో ఆ సినిమా ఒక‌టిన్న‌ర మిలియ‌న్ల డాల‌ర్ల‌కిపైగా సొమ్ము చేసుకొంది. అది చాలా పెద్ద అమౌంట్‌. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా మ‌న రూపాయ‌ల్లో ప‌ది కోట్లన్న‌మాట‌. ఒక్క ఓవ‌ర్సీస్ నుంచే ప‌ది కోట్లంటే ఆ సినిమాకి పెట్టిన పెట్టుబ‌డంతా అక్క‌డ్నుంచే తిరిగొచ్చింద‌న్న‌మాట‌. ఇక తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చిందంతా మిగులుబాటే. అలాంటి వ‌సూళ్ల‌ని నేను అస్స‌లు ఊహించ‌లేద‌ని నాని కూడా వండ‌ర్ అవుతున్నాడిప్పుడు. ఓవ‌ర్సీస్‌ లో నాని హ‌వాని ముందుగానే గుర్తించిన 14 రీల్స్ సంస్థ కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది.

స్టార్ క‌థానాయ‌కుల చిత్రాల‌కి ఏమాత్రం తీసిపోని త‌ర‌హాలో ఒక్క అమెరికాలోనే 118 సెంట‌ర్లలో 130 స్క్రీన్ ల‌పై సినిమాని విడుద‌ల చేస్తోంది. మొన్న సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన సోగ్గాడే చిన్నినాయ‌నాలాంటిసినిమా అమెరికాలో కేవ‌లం 80 థియేట‌ర్ల‌లో మాత్రమే విడుద‌లైంది. మ‌రి నాన్ స్టార్ అయిన నాని సినిమా 130 స్క్రీన్ల‌లో అంటే ఏ స్థాయిలో విడుద‌ల‌వుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. నాని 2 మిలియ‌న్ల మార్కుపై క‌న్నేశాడ‌ని, సినిమాకి పాజిటివ్ టాక్ కూడా ఉండ‌టంతో ఆ మార్క్‌ని అందుకోవ‌డం కూడా పెద్ద‌గా క‌ష్ట‌మేమీ కాద‌ని ఓవ‌ర్సీస్ బిజినెస్ వ‌ర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకి అమెరికాలో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌చ్చాయి. మ‌రి నాని ఎన్టీఆర్‌ని అధిగమిస్తాడేమో చూడాలి.