నాని శ్రద్ధా VS ప్రభాస్ శ్రద్ధా

Fri Apr 19 2019 20:00:02 GMT+0530 (IST)

టాలీవుడ్ కు ఈ ఏడాది ఇద్దరు హీరోయిన్లు శ్రద్ధా పేరుతో పరిచయమవుతున్నారు. ఒకరు శ్రద్ధ శ్రీనాధ్. రెండు శ్రద్ధ కపూర్. ఇవాళ జెర్సీతో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించడమే కాక మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నట్టు రిపోర్ట్స్ ని బట్టి అర్థమవుతోంది. పిల్లాడికి తల్లిగా నటించినా భర్తను ఆదాయం కోసం ఒత్తిడి చేసే సగటు మహిళగా మెప్పించినా మార్కులు మాత్రం ఫుల్ గా కొట్టేసింది.శ్రద్ధా శ్రీనాథ్ ఎంత టాలెంటెడో బాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలన్నీ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు బాగా తెలుసు. కన్నడ యుటర్న్ లో అద్భుతంగా నటించి దాని విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రద్ధా శ్రీనాథ్ తర్వాత తమిళ నాన్ బాహుబలి బ్లాక్ బస్టర్ గా చెప్పుకునే విక్రమ్ వేదాలో మాధవన్ భార్యగా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మూడో బాష తెలుగు ఎంట్రీ తో కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంది

ఇక రెండో శ్రద్ధా అదే శ్రద్ధా కపూర్ ఆగస్ట్ లో వస్తుంది. ప్రభాస్ హీరోగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సాహో మీద భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న శ్రద్దా కపూర్ కు సౌత్ లో ఇదే మొదటి సినిమా. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని గతంలోనే హింట్ ఇచ్చారు.

సో మొదటి శ్రద్ధా హిట్ కొట్టేసింది కాబట్టి ఇప్పుడీ రెండో శ్రద్ధా సాహో రూపంలో కనక బ్లాక్ బస్టర్ అందుకుంటే ఇదేదో పేరు సెంటిమెంట్ లాగా కలిసి వచ్చిందని కూడా అనుకోవచ్చు. అన్నట్టు శ్రద్ధ పేరు ఇదే మొదటిసారి కాదు. గతంలో శ్రద్ధా దాస్ ఉండేది కానీ అంతగా మెరవలేకపోయింది. కానీ ఈ శ్రద్ధలు మాత్రం మాములు రచ్చ చేసేలా లేరుగా