బిగ్ బాస్ 2 అంటే.. నాని 4 అన్నాడు

Wed May 16 2018 16:21:37 GMT+0530 (IST)


తెలుగులో మొట్టమొదటి రియాలిటీ షో గా స్టార్ మా ఛానల్ తెరకెక్కించిన షో నే బిగ్ బాస్. ఈ ఒక్క షో ఛానల్ టిఆర్పీ ని ఒక్కసారిగా పెంచేసింది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వేరే బాషాలకంటే తెలుగు మొదటి సీజన్ ఎలాంటి కాంట్రావర్సీలకు తావివ్వకుండా బాగా నడిచింది. అంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం షో హోస్ట్ ఎన్టీఆర్ అంటే ఒప్పుకోక తప్పదు. బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పుడు మన ముందుకు రాబోతోంది.షూటింగుల వల్ల బిజీ గా ఉండటంతో ఎన్టీఆర్ హోస్ట్ చేయడం కుదరకపోగా ప్రొడ్యూసర్లు మన నాచురల్ స్టార్ నాని ని రంగంలోకి దింపారు. షూటింగ్ త్వరలో మొదలు కానుండగా హైదరాబాద్ లోనే ఒక స్టూడియోలో సెట్ వేసి నాని సీన్లు షూట్ చేయబోతున్నారు అని సమాచారం. మొదటి సీజన్ కోసం లోనావ్లా ముంబై తిరిగిన ఎన్టీఆర్ లాగా కాకుండా హ్యాపీగా ప్రతి వీకెండ్ నాని హైదరాబాద్ లోనే షూటింగ్ చేయబోతున్నాడు అన్నమాట. ఈ షో కి గాను నాని కి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది భారీ రేంజ్ పేమెంట్ అనే చెప్పాలిలే.

అంతబాగానే ఉంది కాని నాని పైన చాలానే ప్రెషర్ ఉండటం వాస్తవమే. ఎందుకంటే మొదటి సీజన్లో ఎన్టీఆర్ అలా చేశాడు అంటూ ప్రేక్షకులు పోలుస్తూ ఉండచ్చు. మరి వారి అంచనాలను చేరుకోవాలంటే మన యంగ్ హీరో కొంత కష్టపడాల్సిందే. షో మొదటి రోజు వరకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కాంటెస్టెంట్లు ఎవరు అనే విషయం గోప్యంగానే ఉంచటానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి సీజన్ లాగా 70 రోజులు కాకుండా రెండవ సీజన్ 100 రోజులు నడవనుంది అని సమాచారం.