Begin typing your search above and press return to search.

నానీ.. బోర్ కొట్టేస్తోందయ్యా

By:  Tupaki Desk   |   23 Sep 2016 11:44 AM GMT
నానీ.. బోర్ కొట్టేస్తోందయ్యా
X
హెడ్డింగ్ చూసి ఏదో అనుకోకండి. నాని బోర్ కొట్టించేస్తున్నాడేమో.. అతడి నటన బోర్ కొట్టించేస్తోందేమో అని ఫీలవ్వకండి. ఇక్కడ బోర్ కొట్టేస్తున్నది అతను కాదు.. అతడి గురించి రాసే రాతలు. మాట్లాడుకునే మాటలు. మామూలుగా ఓ నటుడు ఫలానా సినిమాలో బాగా చేశాడు.. ఫలానా సన్నివేశంలో బాగా చేశాడు అని చెప్పుకుంటాం. అలాగే ఆ సినిమాలో బాగా చేయలేదని.. ఫలానా సీన్లో ఇబ్బంది పడ్డాడని మాట్లాడుకుంటాం. కానీ నాని మాత్రం అందుకు మినహాయింపు. అతను బాగా చేయని సినిమా లేదు. సరిగా నటించని సన్నివేశం ఉండదు. ఇందుకు తాజా ఉదాహరణ.. మజ్ను సినిమా.

ఇప్పటికే తన నటనతో ఎన్నో సినిమాల్ని నిలబెట్టిన నాని.. ‘మజ్ను’కు కూడా ప్రాణం పోశాడు. నాని లేకపోతే ఈ సినిమా మామూలుగా అనిపించేదంటే సందేహం లేదు. అంతగా ఈ సినిమాకు బలంగా నిలిచాడు నాని. కామెడీ అయినా.. రొమాన్స్ అయినా.. అలాగే ఎమోషనల్ సీన్స్ అయినా.. అలవోకగా చేసేశాడు నాని. ఓ సన్నివేశంలో హీరోయిన్ తల్లి నానికి మంచి నీళ్లిస్తుంది. తాగేసి.. ‘మంచి నీళ్లు చాలా బాగున్నాయి ఆంటీ’ అంటూ ఓ డైలాగ్ చెబుతాడు నాని. ఆ సన్నివేశంలో అతడి హావభావాలు కానీ.. అతను డైలాగ్ చెప్పిన తీరు కానీ.. ఎక్స్ ట్రార్డినరీ అని చెప్పాలి. నాని ప్రత్యేకత ఏంటో చెప్పే ఇలాంటి చాలా సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. ఆరంభంలో రాజమౌళి కాంబినేషన్లో వచ్చే ఇంట్రడక్షన్ సీన్లోనే నాని అదరగొట్టేశాడు. ఇక క్లైమాక్సులో సైతం అదే స్థాయిలో ఎంటర్టైన్ చేశాడు. థియేటర్లో స్పందన చూస్తే నాని ఎంతగా జనాలకు నచ్చేస్తున్నాడో.. అతణ్ని ఎంతగా ఓన్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇలాంటి నటుడుండటం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం అంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.