Begin typing your search above and press return to search.

పవన్ రికార్డును దాటేసిన నాని

By:  Tupaki Desk   |   15 July 2017 11:20 AM GMT
పవన్ రికార్డును దాటేసిన నాని
X
నేచురల్ స్టార్ నాని రేంజ్ సినిమా సినిమాకూ మారిపోతోంది. ఈ ఏడాది ‘నేను లోకల్’ సాధించిన కలెక్షన్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ క్లాస్ టచ్ ఉన్న లవ్ స్టోరీ కావడంతో ఇది కలెక్షన్ల విషయంలో అంత జోరు చూపించకపోవచ్చనుకున్నారు. కానీ ఇది కూడా అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి వీకెండ్లోనే రూ.25 కోట్లకు పైగా గ్రాస్.. రూ.17 కోట్ల దాకా షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం.. తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా అదరగొట్టింది. వారం రోజుల్లోనే మిలియన్ క్లబ్బును అందుకుని ఔరా అనిపించింది. తొలి వీకెండ్లోనే 8 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘నిన్ను కోరి’.. రెండో వీకెండ్ కంటే ముందే మిలియన్ డాలర్ మార్కును అందుకుంది.

ప్రస్తుతం అమెరికాలో అత్యధిక మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న హీరోల్లో నాని.. ఎన్టీఆర్ తో సమానంగా రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. మహేష్ బాబు ఆరు సినిమాలతో (దూకుడు-సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు-1 నేనొక్కడినే-ఆగడు-శ్రీమంతుడు-బ్రహ్మోత్సవం) అగ్రస్థానంలో ఉండగా.. ఎన్టీఆర్ నాలుగు సినిమాలతో (బాద్‌ షా.. టెంపర్.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్‌) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నాని కూడా నాలుగు మిలియన్ డాలర్ మూవీస్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈగ.. భలే భలే మగాడివోయ్.. నేను లోకల్ సినిమాలతో మిలియన్ క్లబ్బును అందుకున్న అతను.. ఇప్పుడు ‘నిన్ను కోరి’తో నాలుగోసారి ఆ క్లబ్బును టచ్ చేశాడు. మూడు మిలియన్ డాలర్ సినిమాలతో (అత్తారింటికి దారేది - గోపాల గోపాల - సర్దార్ గబ్బర్ సింగ్) మూడో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను అతను అధిగమించాడు.