మహేష్ సినిమా ఆ రోజు రానట్లే..

Fri Apr 21 2017 15:25:03 GMT+0530 (IST)

జూన్ 23న థియేటర్లలో కలుద్దాం అంటూ కొన్ని నెలల కిందటే మురుగదాస్ మహేష్ అభిమానులకు భరోసా ఇచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితిచూస్తుంటే ఆ రోజు మహేష్ అభిమానులు థియేటర్లకు రావాల్సిన అవసరం లేనట్లే కనిపిస్తోంది. ఆల్రెడీ మే 19 నుంచి జూన్ 23కి ‘దువ్వాడ జగన్నాథం’ వాయిదా పడ్డట్లు వార్తలొచ్చినప్పుడే ‘స్పైడర్’.. పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సందేహాలకు మరింత బలం చేకూర్చే ప్రకటన వచ్చింది. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ని జూన్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్యే అధికారిక ప్రకటనే ఇచ్చేశాడు. దీన్ని బట్టి ‘స్పైడర్’ వాయిదా పడటం పక్కా అని తేలిపోయింది.

నాని సినిమాకు ధీమాగా రిలీజ్ డేట్ ప్రకటించారంటే ఆ రోజు ‘దువ్వాడ జగన్నాథం’ రావడం కూడా డౌటే అన్నమాట. నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నప్పటికీ.. మహేష్ తో కానీ.. బన్నీతో కూడా పోటీకి దిగే సాహసం చేయకపోవచ్చు. కొత్త దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘నిన్ను కోరి’ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్ ప్లే.. మాటలు సమకూరుస్తుండటం విశేషం. ‘జెంటిల్ మన్’ భామ నివేదా థామస్ మరోసారి నానితో జత కడుతుండగా.. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నాడు. ఇది అమెరికా నేపథ్యంలో సాగే ప్రేమకథ అని సమాచారం. మెజారిటీ షూటింగ్ అమెరికాలోనే చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో చివరి షెడ్యూల్ నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/