Begin typing your search above and press return to search.

బన్నీ హీరో.. నాని డైరెక్టర్.. ఎప్పుడో!

By:  Tupaki Desk   |   23 March 2017 9:55 AM GMT
బన్నీ హీరో.. నాని డైరెక్టర్.. ఎప్పుడో!
X
కొందరు నటులు కావాలని వచ్చి దర్శకత్వ విభాగంలో చేరి ఆ రంగంలోనే ఎదుగుతుంటారు. ఇంకొందరు దర్శకత్వ కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటనలోకి వస్తుంటారు. నాని రెండో కోవకే చెందుతాడు. అతను ఇండస్ట్రీలోకి వచ్చింది దర్శకుడవుదామనే. లెజెండరీ డైరెక్టర్ బాపుతో పాటు మరికొందరు దర్శకుల దగ్గర కూడా పని చేశాడు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంచెం అనుభవం సంపాదించాక నాని దర్శకుడు కావడానికి ప్రయత్నాలు కూడ చేశాడట. అందులో భాగంగా అతను ఓ హీరోకు కథ కూడా చెప్పాడట. ఆ హీరో మరెవరో కాదు.. అల్లు అర్జున్. ఈ విషయాన్ని నానినే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న రోజుల్లో తన ఫ్రెండ్ అయిన నందిని రెడ్డి (ప్రస్తుతం దర్శకురాలు) తనకు రేడియో జాకీగా ఉద్యోగం ఇప్పించిందని.. రూ.16 వేలు జీతం అని.. అది అప్పట్లో తనకు చాలా పెద్ద అమౌంట్ అని.. ఐదారు గంటల్లో ఆ పని ముగించేసి మిగతా సమయంలో హీరోలకు కథలు చెప్పొచ్చని అందులో చేరానని నాని తెలిపాడు. ఆ సమయంలో తాను కథ చెప్పిన ఏకైక హీరో అల్లు అర్జునే అని నాని తెలిపాడు. అది ఫక్తు కమర్షియల్‌ కథ అని.. బన్నీకి కూడా నచ్చిందని.. ఐతే తాను అనుకోకుండా హీరో అయిపోవడంతో ఆ కథ తెర రూపం దాల్చలేదని నాని తెలిపాడు. ఐతే తర్వాత బన్నీ తనను ఎప్పుడు కలిసినా ‘ఆ కథ ఉందిగా... అలాగే ఉంచు’ అని అంటుంటాడని.. తాను అలాగే అని బదులిస్తుంటానని.. చాలామందికి తమ సంభాషణ ఏంటో అర్థం కాదని నాని తెలిపాడు. మరి ఎప్పటికైనా నాని దర్శకుడిగా మారి ఆ కథను తెరకెక్కిస్తాడేమో.. బన్నీ అందులో నటిస్తాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/