Begin typing your search above and press return to search.

ఏడేళ్ల తర్వాత ఆ దర్శకుడితో నాని

By:  Tupaki Desk   |   1 Sep 2015 4:08 PM GMT
ఏడేళ్ల తర్వాత ఆ దర్శకుడితో నాని
X
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ఆరంభించి.. హీరో అవతారమెత్తాడు నాని. తొలి సినిమా ‘అష్టాచెమ్మా’తోనే చాలామంచి పేరు సంపాదించాడు. చాలా తక్కువ టైం లోనే హీరోగా బిజీ అయిపోయాడు. ఐతే డైరెక్టర్ కావాలనుకుంటున్న నానిలో మంచి నటుడున్నాడని గుర్తించింది ఇంద్రగంటి మోహన కృష్ణ. డైరెక్షనే చేయాలని నాని ఫిక్సయి ఉంటే.. ఈపాటికి అతడి కెరీర్ ఎలా ఉండేదో కానీ.. నటుడిగా మాత్రం చాలా మంచి స్థితికి చేరుకున్నాడు. ఇందుకు మోహనకృష్ణకు కృతజ్నతలు చెప్పుకోవాలి. ఐతే ‘అష్టాచెమ్మా’ తర్వాత తన గాడ్ ఫాదర్ తో మళ్లీ పని చేసే అవకాశం దక్కలేదు నానికి. ఎట్టకేలకు తొలి సినిమా చేసిన ఏడేళ్లకు తన ఫేవరెట్ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు నాని.

ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా మొదలవబోతోంది. ఈ మధ్యే నానికి ఇంద్రగంటి ఓ కథ చెప్పాడు. అది నచ్చి నాని ఓకే చెప్పేశాడు. నానిని ఈ కథ గురించి అడిగితే.. ‘‘చాలా చాలా గమ్మత్తుగా, థ్రిల్లింగ్ గా అనిపించింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలుపెడదామా అని ఎదురు చూస్తున్నా’’ అని చెప్పాడు. నాని ఇప్పుడు ఇంద్రగంటితో సినిమా ఒప్పుకుని ఒకరకంగా ఆయన రుణం తీర్చుకుంటున్నట్లే. ఎందుకంటే ‘బందిపోటు’ డిజాస్టర్ గా మిగలడంతో ఇంద్రగంటి పాతాళానికి పడిపోయాడు. ఐతే నాని ఇప్పుడు జోరుమీదున్నాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’ హిట్టయింది. భలే భలే మగాడివోయ్ సినిమా మీద కూడా మంచి అంచనాలున్నాయి. ఇంద్రగంటి-నానిల సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా తేలలేదు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడితోనూ నాని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.