Begin typing your search above and press return to search.

అలా ఆ సినిమా సూపర్ హిట్టయిందన్నమాట..

By:  Tupaki Desk   |   25 July 2016 5:07 AM GMT
అలా ఆ సినిమా సూపర్ హిట్టయిందన్నమాట..
X
కొన్నిసార్లు మంచి సినిమాలు అనుకున్నవి కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తుంటాయి. జనాల్లో పాజిటివ్ టాక్ వచ్చి.. పాజిటివ్ రివ్యూలు వచ్చి కూడా ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతుంటాయి. ఇందుకు రకరకాల ఫ్యాక్టర్ కారణమవుతుంటాయి. గత నెల రిలీజైన నాని సినిమా ‘జెంటిల్‌ మన్’ కూడా ఆ కోవలోనే చేరుతుందని అంచనా వేశారు ట్రేడ్ పండిట్స్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ ఓ మోస్తరు కలెక్షన్లే వచ్చాయి. వీకెండ్ తర్వాత అయితే కలెక్షన్లలో పెద్ద డ్రాప్ కనిపించింది. నానికి మాస్ ఇమేజ్ లేకపోవడం.. సినిమా మరీ క్లాస్‌ గా ఉండటం.. పైగా థ్రిల్లర్ జానర్ కావడంతో కలెక్షన్లు ఆశాజనకంగా కనిపించలేదు. దీంతో ఈ సినిమా లాస్ వెంచర్ అవుతుందని అంచనా వేశారంతా.

కానీ రెండో వారం నుంచి అనూహ్యంగా పుంజుకుని.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది నాని సినిమా. ఇందుకు వారం వారం విడుదలవుతున్న వేరే సినిమాలు ఒక రకంగా కారణమని చెప్పొచ్చు. ‘జెంటిల్ మన్’ వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రావడం.. అవి తీవ్రంగా నిరాశపరచడంతో ప్రేక్షకులు మళ్లీ నాని సినిమా వైపు చూడటం.. ఇలా సాగింది వరస. నాని సినిమా విడుదలైన తర్వాతి వారం ‘ఒక మనసు’ మంచి అంచనాలతో విడుదలైంది. కానీ అంచనాల్ని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఆ తర్వాతి వారాల్లో రోజులు మారాయి.. దొర.. అంతం.. సెల్ఫీ రాజా.. నాయకి లాంటి సినిమాలొచ్చాయి.

వీటిలో ఏది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడం ‘జెంటిల్ మన్’కు కలిసొచ్చింది. నాలుగో వారాంతంలో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఓ దశలో రూ.15 కోట్ల మార్కును అందుకోవడం కష్టం అనుకున్న ఈ సినిమా ఇప్పుడు రూ.20 కోట్ల మార్కును దాటేసి సూపర్ హిట్ రేంజికి చేరుకుంది. నిర్మాతకు.. బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అమెరికాలో దాదాపుగా మిలియన్ మార్కును టచ్ చేసింది ఈ సినిమా. ఒక సినిమాకు హిట్ టాక్ వచ్చినా.. తర్వాతి వారం కొత్త సినిమా వచ్చి అది బాగుందంటే పాత సినిమాను పక్కనబెట్టేస్తారు జనాలు. థియేటర్ల యజమానులూ అంతే. కానీ నాని సినిమా మాత్రం నెల రోజుల తర్వాత కూడా చెప్పుకోదగ్గ థియేటర్లలో ఆడుతోంది. ఆదరణ పొందుతోంది.