Begin typing your search above and press return to search.

జాగ్రత్త నానీ! మెగాస్టార్ అంటున్నారు

By:  Tupaki Desk   |   24 Feb 2018 3:30 PM GMT
జాగ్రత్త నానీ! మెగాస్టార్ అంటున్నారు
X
టాలీవుడ్ లో ఎవరైనా హీరో కష్టపడి పైకి వస్తే.. అతడిని మెగాస్టార్ చిరంజీవితో కంపేర్ చేయడం కనిపిస్తూనే ఉంటుంది. చిరుకు ముందు కూడా కష్టపడి పైకొచ్చిన హీరోలు ఉన్నా.. వారికి తొలినాళ్లలో అడ్వాంటేజ్ ఉండేది. కానీ పోటీ పెరిగిపోయిన తర్వాత అందరినీ దాటుకుంటూ ఎదిగిన స్టార్ హీరో చిరంజీవి. అందుకే ఇలా పోల్చుతుంటారు.

ఇవాళ నాని పుట్టిన రోజు సందర్భంగా.. బోలెడంత మంది విషెస్ చెప్పారు. నానితో మూవీ తీస్తున్న..చేస్తున్న వారంతా పోస్టర్ల ద్వారా శుభకాంక్షలు తెలిపారు. ఈ న్యాచురల్ స్టార్ తో మూవీ చేయాలని ఆశిస్తున్న మేకర్స్ కూడా ఇలాంటి పనులే చేశారు. అంతే.. ఇక మెగాస్టార్ రేంజ్ కు నాని అంటూ ప్రచారం మొదలైపోయింది. చిన్న సినిమాల స్థాయి నుంచి అభిమానులను క్రమంగా పెంచుకుంటూ నాని ఎదిగిన తీరును ప్రశంసించాల్సిందే. కానీ అప్పుడే మెగాస్టార్ అని మోసేయడం మాత్రం సరైన విషయం కాదని చెప్పాలి. ఇలా పొగిడేవారికి నానితో ఏమైనా స్వప్రయోజనాలు ఉండి ఇలా చేస్తున్నారేమో అనిపించక మానదు.

నిజానికి గతంలో అల్లరి నరేష్‌ వరుసగా హిట్స్ కొడుతున్నపుడు కూడా ఇలాగే ఎత్తేసి చివరకు మూస సినిమాలు చేస్తున్నాడంటూ కిందకు పడేశారు. మాస్ మహరాజ్ గా ఎదిగిన రవితేజ కూడా ఇలాగే ఎత్తేసి.. చివరకు తోసేశారు. ఈ భజనరాయుళ్లకు ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్న నాని దొరికాడంతే. ఇప్పటికే ఎంసీఏ రొటీన్ అంటూ ఓసారి నానిని ఆడుకున్నారు. ఇంకో సినిమా ఏదైనా తేడాపడితే అప్పుడు రచ్చ మరీ ఎక్కువయిపోతుంది. ఈలోగా వచ్చిన పుట్టినరోజునాడు కాసింత భజన చేస్తున్నారంతే.. జాగ్రత్త నానీ!