Begin typing your search above and press return to search.

నాని రేంజే మారిపోయేలా ఉందే..

By:  Tupaki Desk   |   5 Sep 2015 11:54 AM GMT
నాని రేంజే మారిపోయేలా ఉందే..
X
అష్టాచెమ్మా లాంటి చిన్న సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన నాని.. నటుడిగా చాలా త్వరగా మంచి పేరు సంపాదించాడు. అతడి కెరీర్ సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది. ఐతే మధ్యలో వరుసగా రెండు మూడు ఫ్లాపులు ఎదురయ్యేసరికి కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. దాదాపు ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడీ టాలెంటెడ్ యాక్టర్. దీంతో అతడి మార్కెట్ కూడా బాగా దెబ్బతింది. కానీ ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాని.. ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ హిట్ టాక్ తో గాల్లో తేలిపోతున్నాడు. ఇప్పటిదాకా నానికి సక్సెస్ లు ఉన్నాయి కానీ.. కమర్షియల్ గా పెద్ద హిట్లు లేవనే చెప్పాలి. ఐతే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తర్వాత నాని రేంజే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఈగ’ సినిమాను మినహాయిస్తే నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనదగ్గ పిల్ల జమీందార్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువే వసూలు చేసేలా ఉంది ‘భలే భలే మగాడివోయ్’.

గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలు కలిసి చేసిన సినిమా కావడంతో నాని కెరీర్లోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో విడుదలైంది ‘భలే భలే మగాడివోయ్’. ప్రమోషన్ కూడా ఓ రేంజిలో చేయడం.. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటంతో తొలి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.2.5 - 3 కోట్ల దాకా లెక్క తేలొచ్చని సమాచారం. నాని మార్కెట్ ప్రకారం చూస్తే ఇది చాలా చాలా పెద్ద ఫిగర్. అతడి గత సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫుల్ రన్ లో రూ.5 కోట్లు కూడా వసూలు చేసినట్లు లేదు. అలాంటిది ‘భలే భలే మగాడివోయ్’ తొలి రోజే అందులో సగం రాబట్టడమంటే చిన్న విషయం కాదు. భలే భలే..తో పాటు ఈ వారం రెండు సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే నాని సినిమా జోరు ఎలా ఉందో తొలి రోజు కృష్ణా జిల్లాలో వచ్చిన వసూళ్లే నిదర్శనం. ఫస్ట్ డే ఈ జిల్లాలో భలే భలే.. రూ.10 లక్షలకు పైనే వసూలు చేసింది. ఐతే డైనమైట్ మాత్రం రూ.3 లక్షలకు, జయసూర్య రూ.2.5 లక్షలకు పరిమితమయ్యాయి. సినిమాకు వస్తున్న టాక్ ప్రకారం చూస్తే ఫుల్ రన్ లో సినిమా రూ.20 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. అదే నిజమైతే పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు రాబోతున్నట్లే. ఈ దెబ్బతో నాని రేంజి మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.