సూపర్ స్టార్ కోసం న్యాచురల్ స్టార్

Tue Jun 25 2019 11:36:09 GMT+0530 (IST)

ఈ నెల 28న జరగబోయే మహర్షి అర్ధశతదినోత్సవ వేడుకలకు హైదరాబాద్ శిల్పకళావేదిక సిద్ధమవుతోంది. 200 కేంద్రాల్లో యాభై రోజులు ఆడినట్టు నిర్మాతలు ప్రకటించడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ కారణంగానే ఊహించిన దాన్ని కన్నా ఎక్కువగానే ప్యాన్స్ తాకిడి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే దీనికి గెస్ట్ గా ఎవరు వస్తారు అనే సస్పెన్స్ ఇందాకటి వరకు కొనసాగింది.లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మహర్షికి చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు. ఈ మేరకు దిల్ రాజు అతని నుంచి అంగీకారం తీసుకున్నాడట. నాని వస్తున్నాడు అంటే ఇంకాస్త జోష్ పెరుగుతుంది. తన మాటతీరుతో ప్రత్యేకంగా ఆకట్టుకునే నాని స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయం. ఈ వేదికపై నాని మహేష్ గురించి ఏం చెబుతాడా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే నాని హీరోగా కెరీర్ మొదలుపెట్టకముందే మహేష్ స్టార్ హీరో. అప్పటికి ఇప్పటికి ఇద్దరి మార్కెట్ ఇమేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. మహేష్ రేంజ్ పెరగడం సహజమే కానీ నాని అనూహ్య రీతిలో దూసుకుంటూ వచ్చాడు. అందుకే నాని మాటల్లో మహేష్ గురించి వినాలని ఫ్యాన్స్ ఉత్సాహ పడుతున్నారు. మహర్షి ప్రమోషన్స్ లో విస్తృతంగా పాల్గొని ఆ తర్వాత లండన్ వెళ్ళిపోయిన మహేష్ ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ ఫంక్షన్ లోనే సరిలేరు నీకెవ్వరు గురించి కూడా ఏమైనా మాట్లాడతారేమో అన్న అంచనా కూడా ఉంది.