సావిత్రికి ఎన్టీఆర్ దొరికారా?

Sun Jan 21 2018 15:16:42 GMT+0530 (IST)

స్టార్ హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరు లేకపోయినా సబ్జెక్ట్ ని బట్టి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపుతున్న సినిమాగా మహానటి ముందు నుంచి వార్తల్లో ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం నాగ అశ్విన్ దీన్ని తీర్చిదిద్దుతున్న తీరు చూస్తుంటే అంచనాలు నిలబెట్టేలానే ఉంది. ప్రస్తుతం కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న మహానటికి అతి పెద్ద సమస్య ఎన్టీఆర్ పాత్రధారి. జూనియర్ ఎన్టీఆర్ తో ఇది వేయించాలనే ప్రయత్నాలు జరిగినప్పటికీ తారక్ సున్నితంగా తిరస్కరించాడు అనే టాక్ నెలల క్రితమే వచ్చింది. ఎఎన్ఆర్ పాత్రకు విజయ్ దేవరకొండ దొరికాడు కాని ఎన్టీఆర్ కు దొరకక నాగ అశ్విన్ చాలా టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రను న్యాచురల్ స్టార్ నాని చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది యూనిట్ నుంచి అఫీషియల్ గా వచ్చిన వార్త కాదు కాని నిజమయ్యే అవకాశాల గురించి చర్చ జోరుగానే సాగుతోంది.నాని ఒప్పుకోవచ్చు అనుకోవడానికి ఇక్కడ ప్రధాన కారణం ఒకటి ఉంది. తన కెరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగానే కాకుండా స్పెషల్ మూవీగా మిగిలిపోయిన ఎవడే సుబ్రహ్మణ్యం టైం నుంచి నాగఅశ్విన్ తో నానికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దాంతో పాటు నిర్మాత స్వప్నా దత్ - దర్శకురాలు నందిని రెడ్డి కూడా నానికి మధ్యవర్తిత్వం చేసారట. ఆ చనువుతోనే అడిగి కన్విన్స్ చేసి ఉండవచ్చు అని టాక్. పైగా మహానటిలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి మరీ ఎక్కువ సన్నివేశాలు ఏమి ఉండవు. అందుకే తక్కువ కాల్ షీట్స్ తోనే ఫినిష్ చేసేలా ఒప్పించారని తెలిసింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే కనక మహానటి సినిమాకు మరింత వెయిట్ వస్తుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నప్పటికి దిగ్గజాలు కూడా ఇందులో నటిస్తున్నారు.

మోహన్ బాబు ఎస్విఆర్ గా - దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమిని గణేషన్ గా నటిస్తున్న ఈ మూవీలో సమంతా సావిత్రి కథను ప్రేక్షకులకు చెప్పే జర్నలిస్ట్ పాత్రను చేసిందని తెలిసింది. అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే జమున గారిలా కనిపిస్తుంది. రంగస్థలంతో పోటీకి సిద్ధపడనున్న మహానటికి మూడు నెలల సమయం కూడా లేదు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేసారు. మరి నాని ఎన్టీఆర్ గా మారతాడో లేదో కొద్ది రోజులు ఆగితే కాని ఖరారు కాదు. .అప్పటి దాకా ఇది గాసిప్ గా తీసుకోవాల్సిందే.