Begin typing your search above and press return to search.

ఫ్లాప్ కాంబినేన్ వైభోగమే

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:30 PM GMT
ఫ్లాప్ కాంబినేన్ వైభోగమే
X
‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది నందిని రెడ్డి. లేడీ డైరెక్టర్లు సినిమాలు తీయడమే అరుదైపోతున్న రోజుల్లో.. ఓ సూపర్ హిట్ తో లేడీ డైరెక్టర్ అరంగేట్రం చేయడం చాలా అరుదైన విషయం అయింది. నందిని గురించి మిగతా ఇండస్ట్రీల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ తొలి సినిమాతో వచ్చిన పేరంతా రెండో సినిమా ‘జబర్దస్త్’తో పోగొట్టుకుంది నందిని. సినిమా ఫ్లాపవడం పెద్ద విషయం కాదు కానీ.. బాలీవుడ్ మూవీ బ్యాండ్ బాజా బారత్ ను కాపీ కొట్టేసి ఈ సినిమా తీయడమే ఆమెపై తీవ్ర విమర్శలకు కారణమైంది. అందుకే నందినికి మళ్లీ ఇంకో అవకాశం రావడానికి చాలా టైమే పట్టింది.

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నందిని దర్శకత్వంలో ‘కళ్యాణ వైభోగమే’ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. నందినికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన దామోదర్ ప్రసాదే ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ‘అలా మొదలైంది’ తర్వాత ఆయన పరిస్థితి కూడా ఏం బాలేదు. ఈ మధ్య వచ్చిన ‘హోరాహోరీ’ ఎలాంటి ఫలితం చూసిందో తెలిసిందే. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.. హీరో కూడా ఓ పెద్ద ఫ్లాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. నాగశౌర్య లాస్ట్ మూవీ ‘జాదూగాడు’ అతణ్ని బాగా డిజప్పాయింట్ చేసింది. మొత్తానికి పెద్ద ఫ్లాపులు ఎదుర్కొన్న ముగ్గురు కలిసి ‘కళ్యాణ వైభోగమే’ అంటూ వస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి కసిగానే పని చేసి ఉంటారు. మరి ఈ ముగ్గురికి సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఫస్ట్ లుక్ లో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా డిసెంబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంది.