'లెజెండ్' జోకులు పేలుతున్నాయ్

Thu Nov 16 2017 10:10:22 GMT+0530 (IST)

నంది అవార్డులు.. వీటిని ఏ ముహూర్తాన ప్రకటించారో కాని.. అసలు భారీ రేంజులో చర్చలు గొడవలు సెటైర్లు రేగిపోతున్నాయి. అవి సైకిల్ అవార్డ్స్ అంటూ నిర్మాత బండ్ల గణేష్ కామెంట్ చేస్తే.. అసలు మెగా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటూ గీతా ఆర్ట్స్ క్యాంపులోని కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు కామెంట్ చేశారు. అయితే మొత్తంగా 2014కు గంపగుత్తగా అసలు పక్కా ఊరమాస్ సినిమా అయిన లెజెండ్ కు అవార్డులు ఇవ్వడాన్ని సోషల్ మీడియాలో చాలామంది తప్పుబట్టేస్తున్నారు. దీనిపై బాలయ్య అభిమానులు కూడా ఒక స్ర్టాంగ్ కౌంటర్ రెడీ చేశారు.సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల కౌంటర్ ఇలా ఉంది. ''1984లో మంగమ్మగారి మనవడు వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి బాలయ్యకు గాని.. ఆ సినిమాకు గాని అవార్డులు రాలేదే? 1986లో బాలయ్యవి 6 సినిమాలు రిలీజ్ అయ్యాయ్. కాని ఒక్క నంది అవార్డ్ కూడా రాలేదు. 1991లో సింగీతం డైరక్షన్లో ఆదిత్య 369.. 1994లో భైరవద్వీపం వచ్చాయి. అప్పుడు కూడా అవార్డులు రాలేదు. 2000వ సంవత్సరంలో సమర సింహా రెడ్డి అంత పెద్ద హిట్ అయినా కూడా.. బావ చంద్రబాబు చీఫ్ మినిష్టర్ అయినా కూడా.. బాలయ్యకు నంది రాలేదు'' అంటూ ఒక స్ర్టాంగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

అయితే దీనిని అడ్డుపెట్టుకునే ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ''అంటే తండ్రి ఎన్టీఆర్ మహానుభావుడు కాబట్టి పదవిలో ఉండి కూడా తన ఫ్యామిలీకి ఫేవర్లు చేయలేదు. కాని బాలయ్య మాత్రం ఆయనే స్వయంగా జ్యూరిలో ఉండి అవార్డులు ఇచ్చేసుకున్నారా?'' అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు.. నిజానికి లాజికల్ గా చూస్తే అప్పటి అవార్డుల సమయంలో ఏం జరిగిందో వారే చెప్పడం విశేషం.

''1994లో సింగీతం తీసిన మయూరి అనే సినిమాకు 14 నంది అవార్డులు వచ్చాయి. అది రికార్డ్. కృష్ణంరాజుకు.. విజయశాంతికి వేరే సినిమాలకు బెస్ట్ నటుల అవార్డులు వచ్చాయి. వారిని కాదని బాలయ్య అవార్డు ఇస్తే ప్రెస్ ఏకేస్తుంది. అలాగే 1991లో యజ్ఞం సినిమాకు బెస్ట్ ఫిలిం.. మామగారు సినిమాకు దాసరికి బెస్ట్ యాక్టర్.. క్షణక్షణం కోసంశ్రీదేవికి బెస్ట్ నటి అవార్డులు వరించాయి. వీటిని కాదని ఆదిత్య 369కు బాలయ్యకు అవార్డు ఇవ్వలేరు. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ కంటే సామాజిక స్పృహ ఉన్న సినిమాలకే అవార్డులు ఇవ్వాలనేది అప్పటి నంది జ్యూరి ఫీలింగ్. కాని ఆదిత్య 369కు బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది వచ్చింది. అలాగే 1995లో సొగసు చూడ తరమా సినిమాకు బెస్ట్ ఫిలిం.. వెంకటేష్ (ధర్మచక్రం)కు బెస్ట్ యాక్టర్.. ఆమని (శుభసంకల్పం)కు బెస్ట్ నటి అవార్డులు వచ్చాయి. భైరవ ద్వీపంకు ఎలా ఇస్తారు?'' అంటూ ఇతర సినిమా లవ్వర్లు కూడా నెట్టింట్లో కౌంటర్లు గట్టిగానే దంచుతున్నారు.

అసలు వీటన్నింటికీ నందమూరి బాలకృష్ణ ఎలా రెస్సాండ్ అవుతారన్నది చూడాలి. పైగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొందరు ఈ అవార్డులతో హ్యాపీగా ఉంటే.. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.