Begin typing your search above and press return to search.

నాగార్జున గారూ.. ఎక్కడో కొడుతోందండీ

By:  Tupaki Desk   |   29 Aug 2015 6:58 AM GMT
నాగార్జున  గారూ.. ఎక్కడో కొడుతోందండీ
X
‘మనం’ లాంటి మధుర విజయం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్నాడు అక్కినేని నాగార్జున. ఆ గ్యాప్ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు మొదలుపెట్టాడు నాగ్. అందులో ఒకటి సొంత నిర్మాణ సంస్థలో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేస్తున్న ‘సోగ్గాడె చిన్నినాయనా’ కాగా.. ఇంకోటి కార్తితో చేస్తున్న మల్టీస్టారర్ సినిమా. నాగ్-కార్తి సినిమా గురించి ప్రేక్షకులకు ఇప్పటికే ఓ ఐడియా ఉంది. ఇది ‘ది ఇన్ టచబుల్స్’ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని ప్రచారం జరుగుతుంటే నాగ్ కూడా ఆ విషయాన్ని ఖండించలేదు. ఆ సంగతి నిజమే అని ఒప్పేసుకున్నాడు. ఇక సోగ్గాడె చిన్నినాయనా గురించి ఏ సమాచారం లేదనుకుంటుంటే.. దాని గుట్టు కూడా స్వయంగా నాగార్జునే విప్పేశాడు.

ఇది తండ్రీ కొడుకుల కథ అని.. తండ్రి పాత్ర ఒక ఆత్మ అని.. చనిపోయి ఆత్మగా వస్తాడని.. కేవలం కొడుక్కి మాత్రమే కనిపిస్తాడని.. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని.. చెప్పాడు. ఐతే ఇలా ఆత్మ ఒకరికే కనిపించడం కొత్తేమే కాదు. ఈ మధ్య సూర్య నటించిన ‘రాక్షసుడు’ సినిమా కూడా ఇలాంటి కథాంశంతోనే తెరకెక్కింది. మరి నాగ్ సినిమాలో కొత్తగా ఏముంటుందో చూడాలి.ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే.. పాత కథల్ని కూడా తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారన్న నమ్మకంతోనే నాగ్ అడుగేసినట్లుంది. ఈ సినిమా విశేషాల గురించి మరింత వివరిస్తూ.. ‘‘నేనో పాత్రలో సోగ్గాడిగా కనిపిస్తా. మరో పాత్రలో కాస్త అమాయకంగా, విదేశాల నుంచి వచ్చిన వైద్యుడిగా కనిపిస్తా. పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. తండ్రి పాత్రకి జోడీగా రమ్యకృష్ణ, కొడుకు పాత్రకు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత రమ్యకృష్ణతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నాం. రెండుచోట్లా ఒకేసారి విడుదల చేస్తాం’’ అని నాగ్ వెల్లడించాడు.