Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ మళ్లీ నాగార్జునతో..

By:  Tupaki Desk   |   26 Feb 2017 11:16 AM GMT
రాజ్ తరుణ్ మళ్లీ నాగార్జునతో..
X
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో రాజ్ తరుణ్ ఫేట్ మారిపోయింది. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఆ సినిమా సర్ప్రైజ్ హిట్టయింది. నటుడిగా రాజ్ తరుణ్ కు కూడా మంచి పేరొచ్చింది ఆ సినిమాతో. అప్పుడప్పుడూ చిన్న సినిమాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకునే అక్కినేని నాగార్జున ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ్ మరోసారి రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని ఆయనొక్కరే నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రంజని అనే కొత్త దర్శకురాలు రూపొందిస్తోంది.

చడీచప్పుడు లేకుండా సెట్స్ మీదికి వెళ్లిపోయిన ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ కూడా మొదలైపోయింది. ఇప్పటిదాకా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఐదు సినిమాల్లో నాలుగు హిట్టయ్యాయి. దీంతో అతడికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఐతే రాజ్ వాటి లోంచి జాగ్రత్తగా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నాడు. ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాను పూర్తి చేసిన రాజ్ తరుణ్.. మధ్యలో సంజన అనే మరో లేడీ డైరెక్టర్ తో ఒక సినిమా మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. ఇంతలో నాగ్ నిర్మాణంలో రంజని దర్శకత్వంలో సినిమా స్క్రిప్టు రెడీ అవడంతో దాన్ని పట్టాలెక్కించేశాడు. శ్రీవిష్ణు సినిమా ‘మా అబ్బాయి’తో కథానాయికగా పరిచయం కానున్న చిత్ర శుక్లా ఇందులో కథానాయిగా నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/