అలియా గురించి నాగ్ ఏమన్నాడో తెలుసా?

Thu Jul 12 2018 14:14:50 GMT+0530 (IST)

పదిహేనేళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో...  అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న  బ్రహ్మాస్త్రలో నాగ్ కి కీలక పాత్ర దక్కింది. ఇందులో అమితాబ్ - రణ్ బీర్ - అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. ``హిందీలో చివరిగా ఏ సినిమా  చేశానో కూడా నాకు గుర్తు లేదు. కానీ చాలా రోజుల తర్వాత మళ్లీ హిందీ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉంద``న్నారు. నాగ్ కి హిందీ సినిమాలు కొత్తేమీ కాదు. శివ - క్రిమినల్ - ఖుదా గవా - అంగారీ - జక్మ్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే పదిహేనేళ్ల కిందట ఎల్.ఓ.సిలో నటించారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర నాగ్ ది. అయితే తనకి జక్మ్ లో నటిస్తున్న రోజులు బాగా గుర్తున్నాయన్నారు నాగార్జున.మహేష్ భట్ దర్శకత్వం వహించిన చిత్రం జక్మ్. ఆ సినిమా సెట్లోకి భట్ కూతురైన అలియా భట్ వచ్చేదని - అప్పుడా అమ్మాయి చాలా చిన్నపిల్ల అని ఆ రోజుల్ని గుర్తు చేసుకొన్నారు నాగ్. కాలం గిర్రున తిరిగిందనీ - ఇప్పుడేమో అలియాభట్ తో కలిసి నేను నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు నాగ్. `బ్రహ్మాస్త్ర`లో తాను చేయబోతున్న  పాత్రేంటన్నది నాగ్ బయటపెట్టలేదు కానీ... అది నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటంతోనే ఆ అవకాశం నాకు వచ్చుంటుందని భావిస్తున్నా అన్నారు. నాగార్జునకీ - అమితాబ్ బచ్చన్ కీ మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ కలిసి ఖుదాగవాలో నటించారు. మనం కోసం కూడా అమితాబ్ ఓ చిన్న పాత్ర చేశారు. ఈ పాత్రని అమితాబ్ సూచించడంతోనే నాగ్ చేయడానికి ఒప్పుకొనుంటాడని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. హిందీ చిత్రాలే కాదు... ఏ భాషలో సినిమా చేయడానికైనా తాను రెడీనే అనీ కాకపోతే అందుకు తగ్గ కథ కుదరాలనీ  ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు నాగ్.