మామా కోడళ్ల ప్రమోషన్ అదిరింది!

Thu Oct 12 2017 22:26:55 GMT+0530 (IST)

దక్షిణాదిలో కొందరు హీరోయిన్లు తమ సినిమా ప్రమోషన్లకు మొక్కుబడిగా హాజరవుతారన్న సంగతి తెలిసిందే. నయనతార వంటి స్టార్ హీరోయన్ అయితే తాను ప్రమోషన్లలో పాల్గొనని నిర్మాతలకు ముందే కండిషన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే స్టార్ హీరోయిన్ సమంత నటన పట్ల - తాను నటించిన సినిమాల పట్ల ఎంత అంకిత భావంతో ఉంటుందో మరోసారి రుజువైంది. కొత్త పెళ్లికూతురు అయి ఉండి కూడా సమంత తన సినిమా రాజుగారి గది-2 ప్రమోషన్ లో పాల్గొని చాలామంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది. ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమంత మాట్లాడింది. ఇకపై తాను అక్కినేని సమంత అని - అక్కినేని వారి కోడలు అయ్యానని ఈ సందర్భంగా సమంత వ్యాఖ్యానించింది.ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజుగారి గది-2’ సినిమాలో నాగార్జున - సమంతలు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం కొత్త పెళ్లి కూతురు సమంత పెళ్లి తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగార్జునతో కలిసి ఆమె పాల్గొంది. ఎల్లో కలర్ డ్రెస్ లో వచ్చిన సమంత నవ్వుతూ సరదాగా మాట్లాడింది. అక్కినేని కుటుంబంలో ఆడవాళ్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని అమల గారు ఎంతో ఇండిపెండెంట్ గా ఉంటారని చెప్పింది. అక్కినేని అనేది ఓ పవర్ ఫుల్ నేమ్ తెలిపింది.   తన బెస్ట్ ఫ్రెండ్ నాగచైతన్యని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అక్కినేని కుటుంబంలో తాను కూడా చేరిపోయానని బాధ్యతగా ఉంటానని తెలిపింది. ‘రాజుగారి గది-2’ సినిమా షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయిందని చెప్పింది.

ఈ మీడియా సమావేశంలో మామాకోడళ్లిద్దరూ సందడి చేస్తూ సరదాగా వ్యాఖ్యానించారు.  స్టేజిపై నాగార్జున వేసిన జోకులకు సమంత - చిత్ర యూనిట్ - మీడియా ప్రతినిధులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. చిన్న చిన్న మాటలతో కథను చక్కగా చెప్పిన అబ్బూరి రవి - హార్ట్ నుండి మైండ్ కి కనెక్ట్ అయిన థమన్ - రెండు స్టేట్స్ లో అందరినీ ఆడించే సీరత్ కపూర్ - ఎప్పుడూ నవ్వుతూ ఉండే పీవీపీ - సీరత్ కపూర్‌ను హగ్ చేసేందుకు ఫస్ట్ చాన్స్ ఇచ్చిన ప్రవీణ్ - ఆయన డేట్స్ ఇస్తే మేము షూటింగుకు వెళ్లిన వెన్నెల కిషోర్ - అన్నయ్య పాపం ప్లీస్ అని అడిగితే ఒప్పుకున్న అశ్విన్ - క్లైమాక్స్‌లో నాకంటే బాగా చేసిన కోడలు సమంత....వీరందరూ ఈ సినిమా బాగుందనగానే తనతోపాటు ఈ ప్రెస్ మీట్ కు వచ్చారని నాగార్జున చమత్కరించారు. నాగ్ స్పీచ్ చెబుతున్నంత సేపు అందరూ నవ్వుతూనే ఉన్నారు.

చైతూసమంతల పెళ్లి తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా అని తనకు సమంతకు ఈ సినిమా  చాలా స్పెషల్ అని నాగ్ అన్నారు. ఈ సినిమా హిట్టవ్వకపోతే తాను సమంత...ఒకరి మొహాలు ఒకరం చూసుకోలేమన్నారు. కొత్త కోడలు హిట్ సినిమాతో ఇంట్లోకి అడుగుపెట్టిందని చెప్పుకునేలా ఈ సినిమా ఉండాలని - పెళ్లయ్యాక ప్లాప్ వచ్చిందని చెప్పుకోకుండా ఉండాలని నాగార్జున ఆకాంక్షించారు. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని ప్రతిసారిలాగా ఆడియో ఫంక్షన్ పెట్టి  ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఓంకార్‌కి ఓసీడీ డిజార్డర్ ఉందని - దాంతో సినిమా బాగా వచ్చేవరకు మమ్మల్ని చంపాడని - ఆల్రెడీ అందరూ దెయ్యాలయిపోయారని చమత్కరించారు. ఎప్పుడూ చిరాకు పడని నాకు కూడా ఓంకార్  చిరాకు తెప్పించాడని షూటింగ్ లాస్ట్ డే నీ సినిమాకో దండం అని హ్యాపీగా వెళ్లిపోయానని జోక్ చేశారు. ఓంకార్ పడిన కష్టానికి తపనకి శ్రమకి తప్పక ఫలితం వస్తుందని నాగ్ అన్నారు. సమంత చైతు రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని ఉందని వాళ్లు డేట్స్  ఇవ్వడం లేదని నాగ్ చెప్పారు.

ఈ మీడియా సమావేశంలో సమతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి తర్వాత బిజీగా ఉన్న మామా కోడళ్లు ఇద్దరు ఈ సినిమా ప్రమోషన్ లో  పాల్గొనడం అభినందనీయమని పలువురు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. కొత్త పెళ్లికూతురు సమంత ఎల్లో డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉందని ట్విట్టర్లో పొగుడుతున్నారు. మామా కోడళ్ల ప్రమోషన్ అదిరిందని కొందరు ట్వీట్ చేశారు.