Begin typing your search above and press return to search.

శ్రీదేవి కోసం నాగ్-వర్మ

By:  Tupaki Desk   |   25 Feb 2018 9:41 AM GMT
శ్రీదేవి కోసం నాగ్-వర్మ
X
ఆదివారం సెలవు రోజు సినిమా పరిశ్రమలోని వ్యక్తుల ఇళ్లలోనే కాక సినిమా ప్రేమికులెవరు కనీసం నవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు. కారణం అందాల తార శ్రీదేవి అకాల మరణం చెందటం. ఈ రోజు ఉదయం గుండెపోటుతో కాలం చేసిన శ్రీదేవికి దేశవ్యాప్తంగా నివాళి కొనసాగుతూనే ఉంది. రాజకీయ - సినిమా - క్రీడలు ఒకటేమిటి అన్ని రంగాల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా శ్రీదేవికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు - ఆరాధించే వాళ్ళు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. వర్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉదయం నుంచి ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు. శ్రీదేవిని ఉద్దేశించి అద్భుతంగా రాసిన ప్రేమ లేఖ ఇప్పటికే వైరల్ అవుతోంది. తనలో ఎంత గొప్ప అభిమాని ఉన్నాడో వర్మ మరో సారి చాటి చెప్పాడు. అతని ఐడియాలజిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ ఒక్క విషయంలో వర్మను మెచ్చుకుంటున్నారు.

ఇక శ్రీదేవితో రెండు సినిమాల్లో నటించిన నాగార్జునకు శ్రీదేవితో అంతకు మించిన అనుబంధమే ఉంది. నాన్న అక్కినేని నాగేశ్వర్ రావు తో ప్రేమాభిషేకం లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఎన్నో సినిమాల్లో ఆవిడ నటించారు. నాగ్ తో ఆఖరి పోరాటం సూపర్ హిట్ కాగా గోవిందా గోవిందా ఫ్లాప్ అయినప్పటికీ స్పెషల్ మూవీ గా నిలిచింది. వర్మ శ్రీదేవితో చేసిన ఒకే ఒక్క సినిమా క్షణక్షణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నాగ్ - వర్మ కలిసి శ్రీదేవికి ప్రత్యేక నివాళి ఇస్తున్నారు.

తమ కాంబోలో రూపొందుతున్న కొత్త సినిమాకు టైటిల్ లాంచ్ తో పాటు ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయాలనీ కొద్ది రోజుల క్రితమే ప్లాన్ చేసారు. కాని ఇవాళ అది కాన్సిల్ చేసుకున్నారు. ఇలాంటి బాధాతప్త హృదయాలతో అది చేయటం ఇష్టం లేకే వాయిదా వేసారు. తిరిగి ఎప్పుడు అన్నది ప్రకటించలేదు కాని కోలుకోవడానికి వర్మకు కొంచెం టైం పట్టేలా ఉంది. సాయంత్రం భౌతిక కాయం ముంబై చేరాక వర్మ - నాగ్ ముంబై వెళ్లి సందర్శించే అవకాశాలు ఉన్నాయని టాక్.