నాగ్ ను ఇబ్బంది పెడుతున్న అప్పటి వ్యాఖ్యలు

Tue Jun 25 2019 11:26:55 GMT+0530 (IST)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి అంతా సిద్దం అయ్యింది. మొదటి రెండు సీజన్ లకు ఎన్టీఆర్ మరియు నానిలు హోస్ట్ లుగా వ్యవహరించగా మూడవ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికి ఇదే నిజం అంటూ అనధికారికంగా మా వర్గాల వారు చెప్పుకొచ్చారు. నాగార్జునపై ఒక ప్రోమో చిత్రీకరణ కూడా జరిగిందట. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 3 కి పార్టిసిపెంట్స్ కూడా దాదాపుగా ఓకే అయ్యారు.అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో నాగార్జునపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. బిగ్ బాస్ గురించి నాగార్జున గతంలో ఒకానొక సమయంలో నెగటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. బిగ్ బాస్ కాన్సెప్ట్ నాకు నచ్చదు అని.. కొంత మంది వ్యక్తులను ఒక చోట ఉంచి వారు ఏం చేస్తున్నారో దొంగ చాటుగా చూడటం అనేది గాసిప్ తో సమానం అన్నట్లుగా గతంలో నాగార్జున అభిప్రాయ పడ్డాడు.

ఇద్దరు శృంగారం చేసుకుంటూ ఉంటే మరో వ్యక్తి చూసినట్లుగానే బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ఉంటుందనే అర్థం వచ్చేలా కూడా నాగార్జున మాట్లాడాడు. బిగ్ బాస్ పై ఇంతటి చెడు అభిప్రాయం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలా ఆ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. నాగార్జున గతంలో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా బిగ్ బాస్ గురించి కామెంట్స్ చేసి ఉంటాడని.. ఇప్పుడు ఆయనకు హోస్టింగ్ ఛాన్స్ వచ్చింది కనుక తప్పకుండా ఆయన మళ్లీ తన మనసు మార్చుకుని బిగ్ బాస్ పై సదాభిప్రాయంకు వస్తాడని కొందరు  ఆశిస్తున్నారు. బిగ్ బాస్ ప్రారంభంకు ముందే నాగార్జునపై ట్రోల్స్ మొదలయ్యాయి. అదే బిగ్ బాస్ మొదలైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనే టెన్షన్ అక్కినేని వర్గాల్లో నెలకొన్నట్లుగా తెలుస్తోంది.