Begin typing your search above and press return to search.

మూడే హిట్లా.. అదెలా నాగ్ సార్?

By:  Tupaki Desk   |   9 Aug 2018 5:54 AM GMT
మూడే హిట్లా.. అదెలా నాగ్ సార్?
X
ఈ ఏడాది తెలుగులోవచ్చిన హిట్లు మూడే మూడంటున్నాడు అక్కినేని నాగార్జున. ‘గూఢచారి’ సక్సెస్ మీట్లో భాగంగా నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశాడు. సమ్మర్లో వచ్చిన ‘రంగస్థలం’.. ‘మహానటి’ మాత్రమే తన దృష్టిలో ఇప్పటిదాకా విజయవంతమైన సినిమాలని నాగ్ చెప్పాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమా ‘గూఢచారి’నే అని నాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ రోజుల్లో హిట్టు కొట్టడం అంటే మామూలు విషయం కాదని.. అందరికీ డబ్బులు తెచ్చిపెట్టిన సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయని.. అందులో ‘రంగస్థలం’.. ‘మహానటి’.. ‘గూఢచారి’ మాత్రమే ఉన్నాయని నాగ్ చెప్పాడు.

ఇక ఒక సినిమా విజయాన్ని కేవలం డబ్బుల కోణంలో మాత్రమే చూడకూడదని.. ఎంత డబ్బులు కలెక్ట్ చేసింది అనేదానికంటే ఎంత ఇంపాక్ట్ చూపించింది... పరిశ్రమకు ఎలాంటి స్ఫూర్తినిచ్చింది అన్నది కూడా ముఖ్యమని.. ఆ విషయంలో ‘గూఢచారి’ ముందు నిలుస్తుందని నాగ్ అన్నాడు. తీసిన బడ్జెట్.. వేసిన ఇంపాక్ట్ ప్రకారం చూస్తే ‘గూఢచారి’ సినిమా ‘రంగస్థలం’.. ‘మహానటి’ సినిమాల్ని కూడా వెనక్కి నెట్టేసిందని నాగ్ కితాబిచ్చాడు.

నాగ్ మాటలు అంతా బాగానే ఉన్నాయి కానీ.. ఈ ఏడాది మూడే హిట్లు అనడం మాత్రం సమంజసం కాదు. నాగ్ చెబుతున్న నిఖార్సయిన హిట్లు మరి కొన్ని ఉన్నాయి. అనుష్క సినిమా ‘భాగమతి’.. నాగశౌర్య చిత్రం ‘ఛలో’.. వరుణ్ తేజ్ మూవీ ‘తొలి ప్రేమ’లతో పాటుగా ఇటీవలే వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ మంచి విజయమే సాధించాయి. వీటిని కచ్చితంగా హిట్లనే చెప్పాలి. అందులోనూ ‘ఆర్ ఎక్స్ 100’ అయితే పెట్టుబడి-లాభాల లెక్కల్లో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. కొన్ని రోజుల కిందటే ‘ఆర్ ఎక్స్ 100’ను అంతలా పొగిడిన నాగ్.. ఇప్పుడా సినిమాను మరిచిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.