Begin typing your search above and press return to search.

నాగ్ ఎంత పెద్ద సాయం చేస్తున్నాడో..

By:  Tupaki Desk   |   5 Sep 2015 1:42 PM GMT
నాగ్ ఎంత పెద్ద సాయం చేస్తున్నాడో..
X
శ్రీకాంత్ మీద అక్కినేని నాగార్జునకు ఇంత ప్రేముందని జనాలకు తెలియదు. లేకుంటే అతడి కొడుకును తన బేనర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడమే విశేషమైతే.. ఆ సినిమాలో తనో అతిథి పాత్ర కూడా చేసి.. మరింత వెయిట్ తీసుకొస్తుండటం ఇంకా పెద్ద విషయం. అవును శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరంగేట్రం చేయబోతున్న ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నాగ్ అతిథి పాత్ర చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగార్జునే స్వయంగా వెల్లడించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం మీద చాలా సెలక్టివ్ గా సినిమాలు నిర్మిస్తాడు నాగ్. ఎప్పుడో ఒకసారి తనే కథానాయకుడిగా సినిమాలు చేస్తుంటాడు. ఇప్పటిదాకా నాగచైతన్య కూడా ఆ బేనర్లో ఒకే ఒక్క సోలో సినిమా చేశాడు. అఖిల్ కు ఇంకా అవకాశం రాలేదు.

అలాంటిది శ్రీకాంత్ కొడుకును తన బేనర్లో ఇంట్రడ్యూస్ చేయడమే కాక.. తాను అతిథి పాత్రలో నటించడమంటే శ్రీకాంత్ కు చాలా పెద్ద సాయం చేస్తున్నట్లే లెక్క. ఇదొక టీనేజ్ లవ్ స్టోరీ అని.. మరాఠీలో విజయవంతమైన సినిమాకు రీమేక్ అని అంటున్నారు. రోషన్ కు కథానాయకుడిగా ఇదే తొలి సినిమా. ఇప్పటికే అతను ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర పోషించాడు. భవిష్యత్తులో హీరోగా వెలిగిపోవాలని ఆశిస్తున్న రోషన్ కు ‘నిర్మలా కాన్వెంట్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. నాగ్ పెట్టుబడి పెడుతున్నాడంటే అది ఆషామాషీ కథైతే అయి ఉండదు. ‘నిర్మలా కాన్వెంట్’కు సంబంధించి ఇప్పటికే ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు నాగ్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.