Begin typing your search above and press return to search.

నాగ్ నోట 'ఆఫీసర్' మాట

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:08 AM GMT
నాగ్ నోట ఆఫీసర్ మాట
X
ఆఫీసర్.. అక్కినేని నాగార్జునకు బాక్సాఫీస్ దగ్గర ఘోర అవమానాన్ని మిగిల్చిన సినిమా. గత దశాబ్ద కాలంలో రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉందో తెలిసి కూడా అతడిని నమ్మాడు. సినిమా చెత్తగా ఉండటం.. వేరే కారణాలు కూడా తోడై ఈ సినిమా దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుంది. ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ కోటి రూపాయల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాగార్జున కొన్ని రోజుల పాటు మీడియాకు దొరకలేదు. ఆ తర్వాత అందరూ ఆ సినిమా సంగతి మరిచిపోయారు. నాగ్ ‘దేవదాస్’ మీదికి వెళ్లిపోయాడు. ఎక్కడా ‘ఆఫీసర్’ గురించి నాగ్ మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ తనకు తానుగా ‘ఆఫీసర్’ ప్రస్తావన తేవడం విశేషం.

ఒక దర్శకుడి ట్రాక్ రికార్డు చూడకుండా.. అతడి వెనుక ఫెయిల్యూర్లు ఉన్నా కూడా ఎలా సినిమా చేయడానికి ఒప్పుకుంటారు అని ఆ ఇంటర్వ్యూలో నాగార్జునను ప్రశ్నిస్తే.. తనకు కొత్తదనం అంటే ఇష్టమని.. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాలు.. సాహసాలు చేస్తుంటానని.. పెద్దగా ఆలోచించనని నాగ్ చెప్పాడు. సినిమా ఫలితం అన్నది తన ఒక్కడి చేతిలో ఉండదని.. రేపు ‘దేవదాస్’ పెద్ద హిట్ కావచ్చని.. ఐతే ఈ సినిమాతో పాటే తాను ‘ఆఫీసర్’ కూడా ఒప్పుకున్నానని.. అలాగే ‘మనం’ చేస్తున్నపుడే ‘భాయ్’ కూడా చేశానని.. అవి రెండూ పూర్తి భిన్నమైన ఫలితాలు అందుకున్నాయని.. ఏదీ మన చేతుల్లో ఉండదు అనడానికి ఇది రుజువు అని నాగార్జున అన్నాడు. హిట్లు ఫ్లాపులకు ప్రభావితం కాకుండా సినిమాలు చేసుకుంటూ పోతుండాలని.. తాను ఎప్పుడూ అదే చేశానని.. ఇప్పుడు తన కొడుకులిద్దరూ కూడా అదే ఆలోచనతో సినిమాలు చేస్తున్నారని.. అది తనకెంతో సంతోషాన్నిస్తోందని నాగ్ చెప్పాడు.