Begin typing your search above and press return to search.

కింగ్ పోస్ట‌ర్ లో ద‌ర్శ‌క‌ధీరుడి ముఖచిత్రం

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:57 AM GMT
కింగ్ పోస్ట‌ర్ లో ద‌ర్శ‌క‌ధీరుడి ముఖచిత్రం
X
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం కింగ్ నాగార్జున న‌టించిన చిత్రం `రాజ‌న్న‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో నాటి స్థానిక‌ ప‌రిస్థితుల‌కు అద్దంప‌డుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టించారు. మొత్తం సినిమాకి విజ‌యేంద్రుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా.. ఈ చిత్రంలోని రోమాంచిత పోరాట ఘ‌ట్టాల‌కు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ ఘ‌ట్టాలు ఈ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌ గా నిలిచాయి.

అయితే అదే స‌మ‌యంలో నాగార్జున త‌ల్లి అన్న‌పూర్ణ‌మ్మ చ‌నిపోవ‌డంతో ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో నాగార్జున స‌హా ఎవ‌రూ పాల్గొనలేదు. ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కపోవ‌డంతో అనుకున్న స్థాయిలో ప్రేక్ష‌కుల‌కు చేర‌లేక‌పోయింది. దాంతో నిర్మాత‌గా నాగార్జున కొంత న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. రాజ‌మౌళి తండ్రి చాలా ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. అయినా త‌ను అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోవ‌డంతో ఆయ‌న కొంత నిరాశ‌కు లోన‌య్యారు. దాదాపు ఈ చిత్రాన్ని అంతా మ‌ర్చిపోయిన ఈ టైమ్ లో ఇప్పుడే ఈ సినిమా గురించి ప్ర‌స్థావ‌న ఎందుకు? అంటే.. దానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది.

తాజాగా ఈ సినిమాని త‌మిళంలో `రాజ‌సింగం` పేరుతో అన్న‌పూర్ణ స్టూడియోస్‌- ల‌క్ష్మీ లోట‌స్ మూవీమేక‌ర్స్ సంయుక్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం రాజ‌మౌళి-కీర‌వాణి- విజ‌యేంద్ర ప్ర‌సాద్ ల త్ర‌యం ఉన్న‌ ఫొటోల‌తో పోస్ట‌ర్ ని వేశారు. రాజ‌న్న భీక‌ర పోరాటాన్ని ఎలివేట్ చేసేలా ర‌క్త‌సిక్త‌మైన చేతిని ఆ పోస్ట‌ర్ పై ముద్రించారు. వేరొక పోస్ట‌ర్ లో రాజ‌న్న లుక్ ని రివీల్ చేశారు. రాజ‌మౌళి యాక్ష‌న్ ఎపిక్ అనే స్లోగ‌న్ తో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ని తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని సూప‌ర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌.బి. చౌద‌రి శుక్ర‌వారం చెన్నైలో విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాని త‌మిళంలోకి అనువ‌దించి రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక ర‌కంగా బ‌య‌టి ప్ర‌పంచానికి అంత‌గా తెలియ‌ని ఒక వీరుడిని త‌మిళ తంబీల‌కు ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం బావుంద‌నే ప్ర‌శంసించాలి. ఇక `బాహుబ‌లి` విజ‌యం త‌రువాత రాజ‌మౌళి క్రేజ్ స్కై హైకి చేర‌డంతో `రాజ‌న్న‌`కు అది వ‌ర్క‌వుట‌వుతుంద‌నే ఇప్పుడిలా రీరిలీజ్ చేస్తున్నారా? అన్న‌ది చూడాలి. టైటిల్ లో సింగం ఉంది కాబ‌ట్టి అది సూర్య ఫ్యాన్స్ లోనూ వ‌ర్క‌వుటవుతుందేమో!!