Begin typing your search above and press return to search.

నాన్న లైఫ్‌ అలా కాదు..అందుకే బయోపిక్‌ వద్దు

By:  Tupaki Desk   |   23 Sep 2018 2:30 PM GMT
నాన్న లైఫ్‌ అలా కాదు..అందుకే బయోపిక్‌ వద్దు
X
బాలీవుడ్‌ లో గత కొంత కాలంగా కొనసాగుతున్న బయోపిక్‌ ల సందడి ప్రస్తుతం టాలీవుడ్‌ లో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ‘మహానటి’ చిత్రంతో సావిత్రి జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు అశ్వినీదత్‌ తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. బయోపిక్‌ ఇప్పటి వరకు అతి పెద్ద విజయంగా ‘మహానటి’ నిలిచింది. ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నందమూరి తారక రామారావు - వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి - కత్తి కాంతారావు - కొండ మురళి ఇంకా పలువురి బయోపిక్‌ లు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఏయన్నార్‌ బయోపిక్‌ గురించి గత కొంత కాలంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

సోషల్‌ మీడియాలో ఏయన్నార్‌ బయోపిక్‌ గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి. గతంలో పలు సార్లు నాగార్జున ఆ వార్తలను కొట్టి పారేశాడు. తాజాగా ఏయన్నార్‌ బయోపిక్‌ పై ఫుల్‌ క్లారిటీని అక్కినేని నాగార్జున ఇవ్వడం జరిగింది. నాన్న గారి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన తనకు లేదని, మరెవ్వరైనా ఆ ఆలోచనతో వచ్చినా కూడా తాము ఆసక్తి చూపించడం లేదంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బయోపిక్‌ లు తెరకెక్కుతున్న వ్యక్తులకు ఏయన్నార్‌ గారి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని నాగార్జున అన్నాడు.

సావిత్రి గారి జీవితాన్ని తీసుకుంటే ఆమె చాలా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు, ఆమె పుట్టిన వాతావరణం, ఆమె ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలు, చివరకు ఆమె మరణం అంతా కూడా సినిమాలా ఉంటుంది. అందుకే ‘మహానటి’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఎన్టీఆర్‌ గారు సినిమాల్లోకి రావడం, రాజకీయాల్లోకి వెళ్లడం కూడా సినిమాటిక్‌ గా ఉంటుంది. ఇక రాజశేఖర్‌ రెడ్డి గారు కూడా ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని సీఎం అయ్యారు. ఇలా జీవితాల్లో నాటకీయ పరిణామాలు ఉంటే బయోపిక్‌ కు బాగుంటుంది.

కాని నాన్నగారి జీవితం అంతా సాఫీగా సాగింది. ఆయన 14వ ఏట నుండి 90వ ఏట వరకు జీవితం అంతా కూడా హాయిగా గడిపేశారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన నిలిచారు. అందుకే ఆయన సినిమా తీస్తే డ్యాక్యుమెంటరీ అవుతుంది తప్ప కమర్షియల్‌ సినిమాలా ఉండదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఏయన్నార్‌ బయోపిక్‌ వచ్చే అవకాశం లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.