Begin typing your search above and press return to search.

నాగార్జునపై రివెంజ్ ప్లాన్ చేశాడా?

By:  Tupaki Desk   |   18 March 2018 7:34 AM GMT
నాగార్జునపై రివెంజ్ ప్లాన్ చేశాడా?
X
కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు అక్కినేని నాగార్జున. ఆయన పరిచయం చేసిన కొత్త డైరెక్టర్లలో చాలామంది మంచి ఫలితాల్ని అందించారు కూడా. ఆయన చివరగా పరిచయం చేసిన కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు కళ్యాణ్. ఈ చిత్రం నాగార్జున హైయెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీని తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో నాగచైతన్యకు మంచి విజయాన్ని, అన్నపూర్ణ సంస్థకు మరోసారి మంచి లాభాల్ని అందించాడు కళ్యాణ్. అయినప్పటికీ కళ్యాణ్‌ను నాగ్ సరిగా ట్రీట్ చేయలేదన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలో ఉన్నాయి.

కళ్యాణ్‌ మూడో సినిమాను కూడా నాగార్జునే చేయాల్సింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘బంగార్రాజు’ సినిమాకు సన్నాహాలు జరిగాయి. కానీ ఆ మధ్య ఈ కథ సరిగా లేదని ప్రెస్ మీట్లో తేలిగ్గా మాట్లాడి కళ్యాణ్ గాలి తీసేశాడు నాగ్. పైగా ఈ సినిమా సంగతి తేల్చకుండా కొన్ని నెలల పాటు కళ్యాణ్ ను వెయిటింగ్ లో ఉంచాడు. దీంతో అతను హర్టయినట్లుగా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటన చూస్తే నాగార్జున మీద అతనేమైనా రివెంజ్ ప్లాన్ చేశాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రవితేజ హీరోగా కళ్యాణ్ రూపొందిస్తున్న ‘నేల టిక్కెట్టు’ ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అదే రోజుకు నాగార్జున సినిమా ‘ఆఫీసర్’ ఆల్రెడీ విడుదల తేదీ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. దానిపై అంచనాలు అంతంతమాత్రం. దాంతో పోలిస్తే ‘నేల టిక్కెట్టు’కు మంచి క్రేజ్ ఉంది. నాగ్ సినిమా ఆ రోజు వస్తుందని తెలిసి కూడా తన చిత్రం విడుదల తేదీని కూడా అదే రోజుకు ప్లాన్ చేశాడంటే నాగ్ మీద కళ్యాణ్ రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడా అని ఇండస్ట్రీ జనాలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.