Begin typing your search above and press return to search.

మళ్లీ అక్కినేని-నందమూరి కాంబో

By:  Tupaki Desk   |   24 Jun 2018 5:46 AM GMT
మళ్లీ అక్కినేని-నందమూరి కాంబో
X
టాలీవుడ్లో నందమూరి-అక్కినేని కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశారు. అవన్నీ అద్భుతంగా ఆడాయి. వీరి తరం తర్వాత నందమూరి-అక్కినేని కాంబో అరుదైపోయింది. చాలా ఏళ్ల కిందట నాగార్జున-హరికృష్ణ కలిసి ‘సీతారామరాజు’ సినిమా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబో కనిపించలేదు. తర్వాతి తరంలో జూనియర్ ఎన్టీఆర్-నాగచైతన్య కలిసి ‘గుండమ్మకథ’లో నటించడం గురించి డిస్కషన్లు నడిచాయి. కానీ ఆ కాంబో కార్యరూపం దాల్చలేదు. ఐతే త్వరలోనే నందమూరి-అక్కినేని కాంబోను మళ్లీ తెరపై చూడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు హరికృష్ణతో తెరను పంచుకున్న నాగ్.. ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడట.

కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అది ఒక మల్టీస్టారర్ అని సమాచారం. అందులో కీలక పాత్రలో నాగ్ నటిస్తాడట. అది పూర్తి స్థాయి నిడివి ఉన్నది కాదు కానీ.. కీలకంగానే ఉంటుందట. ఇప్పటికే నాగార్జునకు కథ వినిపించగా ఆయన ఓకే అన్నట్లు సమాచారం. సోలో హీరోగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న నాగ్.. ఇప్పుడు మల్టీస్టారర్లే ప్రిఫర్ చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే నాని కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదయ్యాక నాగ్ నటించే చిత్రం ఇదే అని సమాచారం. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ గుహన్ రూపొందిస్తున్న సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. త్వరలోనే అది పూర్తి చేసి నాగ్ తో సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామే స్వయంగా నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి.