Begin typing your search above and press return to search.

నాగ్ మాస్ సినిమా అతడితోనే..

By:  Tupaki Desk   |   31 Aug 2015 7:56 AM GMT
నాగ్ మాస్ సినిమా అతడితోనే..
X
కెరీర్ ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చాడు నాగార్జున. ఈ మధ్య వైవిధ్యం మరింత పెరిగింది. గత ఏడాది ‘మనం’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎంత భిన్నమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘సోగ్గాడె చిన్నినాయనా’తో పాటు కార్తితో కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తున్నాడు నాగ్. ఇవి కూడా ఆయనకు భిన్నమైన పాత్రలే. ఐతే కొంచెం డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడూ ఓ మాస్ మసాలా సినిమా చేయడం నాగ్ కు అలవాటు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు పూర్తయ్యాక మాస్ సినిమా చేయాలనుకుంటున్నానని మొన్న బర్త్ డే ఇంటర్వ్యూ ల్లో నాగ్ చెప్పాడు.

దీంతో నాగ్ చేయబోయే మాస్ సినిమాను డైరెక్ట్ చేసే మాస్ డైరెక్టర్ ఎవరబ్బా అన్న ప్రశ్న మొదలైంది. ఐతే ఆ డైరెక్టర్ తెలుగువాడు కాదు. తెలుగువారికి ఆప్తుడైన తమిళుడు. ‘మాస్’ సినిమాతో డైరెక్టర్ గా మారిన రాఘవ లారెన్స్. నాగ్ కు అప్పట్లో ‘మాస్’ సినిమాతో తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన లారెన్స్.. ఆ తర్వాత మన్మథుడిని ‘డాన్’గా చూపించే ప్రయత్నం చేశాడు. అది సరైన ఫలితాన్నివ్వలేదు. మరోవైపు ‘రెబల్’ డిజాస్టరవడంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయాడు. కాంఛన-2తో కోలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న లారెన్స్.. ప్రస్తుతం అక్కడే రెండు సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తయ్యాక నాగ్ తో సినిమా చేయడానికి హామీ తీసుకున్నాడు. ఈ మధ్య ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడట. నాగ్ చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాక.. లారెన్స్ దర్శకత్వంలో పక్కా మాస్ మూవీ మొదలవుతుందని సమాచారం.