Begin typing your search above and press return to search.

నాగ్ గెట‌ప్ రెడీ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   28 May 2016 5:30 PM GMT
నాగ్ గెట‌ప్ రెడీ చేస్తున్నాడా?
X
ఒకొక్క సినిమాకి ఒక్కో అవ‌తారంలో క‌నిపించ‌డం నాగ్‌ కి అల‌వాటు. గీతాంజ‌లి మొద‌లు ఆయ‌న తరచుగా గెట‌ప్పులు మారుస్తూనే ఉన్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన క‌థ‌ల్ని ఎంచుకొంటుండ‌డ‌మే అందుకు కార‌ణం. సినిమాకి త‌గ్గ‌ట్టుగా రూపురేఖ‌లు మార్చుకోవ‌డం నాగ్‌కి చిటికెలో ప‌ని అయిపోయింది. ఏమాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా ద‌ర్శ‌కుడు ఎలా కావాలంటే అలా సిద్ధ‌మ‌వుతుంటాడు. మ‌న్మ‌థుడు అనే బిరుదు ఉన్నా స‌రే, అదేమీ లెక్క చేయ‌కుండా పాత్ర‌ల‌కి త‌గ్గ‌ట్టుగా గెట‌ప్‌ లు ఛేంజ్ చేస్తుంటాడు. అన్నమ‌య్య నుంచి నాగార్జున‌తో భ‌క్తి ర‌స చిత్రాలు చేస్తున్నారు కె.రాఘ‌వేంద్రరావు. అన్న‌మ‌య్య‌ - శ్రీరామ‌దాసు - శిరిడిసాయి... త‌దిత‌ర సినిమాలు చేశారిద్ద‌రూ.

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇటీవ‌ల కాలంలో తీసే ప్ర‌తీ సినిమాకీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో నాగార్జున గెట‌ప్పు సిద్ధం చేయాల్సి వ‌స్తోంది. అన్న‌మ‌య్య కోసం తెల్ల‌టి గెడ్డం, జుత్తుతో క‌నిపించాడు. శ్రీరామ‌దాసు కోసం పొడ‌వాటి జుట్టుతో క‌నిపించాడు. శిరిడి సాయికోసం కూడా తెల్ల‌టి గెడ్డంతో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇప్పుడు న‌మో వెంక‌టేశాయ కోసం కూడా కొత్త గెట‌ప్పుని సిద్ధం చేస్తున్నాడు నాగ్‌. హ‌థీరాం బాబా జీవిత క‌థ‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మ‌ది. వెంక‌టేశ్వ‌ర స్వామికి అప‌ర‌భ‌క్తుడైన హ‌థీరాం బాబాగా నాగార్జున న‌టిస్తున్నాడు. ఆ సినిమాలో ఎలా క‌నిపించాల‌నే విష‌యంపై రెఫ‌రెన్సులేమీ లేవు. దాంతో ఇన్నాళ్లూ నాగ్‌ని తెరపై ఎలా చూపించాలా అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన రాఘ‌వేంద్ర‌రావు చివ‌రిగా ఓ నిర్ణ‌యానికొచ్చేశాడ‌ట‌.

అందుకే నాగ్ కూడా గెడ్డం- మీసాలు పెంచే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌స్తుతం భార్య అమ‌ల‌తో క‌లిసి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. అక్క‌డ తీసుకొన్న కొన్ని ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆ ఫొటోల్లో నాగ్ గుబురు గెడ్డంతో క‌నిపిస్తున్నాడు. దీన్నిబ‌ట్టి ఆయ‌న కొత్త గెట‌ప్పుకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే అని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.