`నిజాయితీ`కి నాగ్ బ్రాండ్ అంబాసిడర్?

Tue Jul 17 2018 22:58:10 GMT+0530 (IST)


ప్రముఖ జ్యూయలరీ షోరూం కల్యాణ్ జ్యూవెలర్స్ కు సినీనటుడు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `కల్యాణ్ జ్యూవెలర్స్` ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున పలు యాడ్ లలో నటించారు. కొద్ది రోజుల క్రితం దుబాయ్ లోని కల్యాణ్ జ్యూవెలర్స్ స్టోర్ లో దొంగ బంగారం అమ్ముతున్నారని.....పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారని సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున నటించిన ఓ యాడ్ ఆసక్తికరంగా మారింది. బ్యాంకు కు వచ్చిన ఓ ముసలాయన గెటప్ లో నాగార్జున.....మేనేజర్ కు తప్పొప్పుల గురించి నిజాయితీ గురించి క్లాస్ పీకడం ఆ వీడియోలో  కనిపిస్తుంది. అయితే కల్యాణ్ జ్యూవెలర్స్ ఎప్పటికీ నిజాయితీగా ఉంటుందని చెప్పేందుకే ఆ యాడ్ షూట్ చేసినట్లు కనిపిస్తోంది.ఓ ముసలాయన తన మనవరాలిని వెంటబెట్టుకొని బ్యాంకుకు వెళతాడు. తన ఖాతాలో రెండు సార్లు పెన్షన్ జమ అయిందని మేనేజర్ కు చెబుతాడు. ఆ రెండో సారి పడిన డబ్బు వాపసు తీసుకోవాలని కోరతాడు. అయితే రెండు సార్లు డబ్బు జమ అయిన సంగతి ఎవరికీ తెలియదని కాబట్టి ఆ డబ్బు ఉంచేసుకోవాల్సిందిగా మేనేజర్ ఉచిత సలహా ఇస్తాడు. ఎవరికైనా తెలిసినా - తెలియకపోయినా...తప్పు తప్పేనని...తానెపుడూ తప్పుచేయనని ...మేనేజర్ కు నాగ్ క్లాస్ పీకుతాడు. దుబాయ్ ఫేక్ వీడియో వల్ల కల్యాణ్ జ్యూవెలర్స్ ఆదాయం తగ్గడంతో పాటు....చెడ్డపేరు కూడా వచ్చిందని తెలుస్తోంది. దీంతో - కస్టమర్లలో ఆ బ్రాండ్ కు ఉన్న భ్రమలను తొలగించేందుకే నాగ్ ఈ యాడ్ చేసినట్లు కనిపిస్తోంది. ఆ ఫేక్ యాడ్ కు కౌంటర్ గానే ఈ యాడ్ ను నాగ్ రూపొందించినట్లుగా ఉంది.