ఆ ప్రతిష్టాత్మక మూవీలో నాగ్ లేడా?

Mon Feb 18 2019 18:50:07 GMT+0530 (IST)

వయసు మీద పడ్డ నేపథ్యంలో కేవలం సోలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గెస్ట్ రోల్స్ లో కూడా నటించేందుకు నాగార్జున ఓకే చెబుతున్నాడు. నాగార్జున ఈమద్య కాలంలో నటించిన 'ఆఫీసర్' 'దేవదాస్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో నాగార్జున తదుపరి చిత్రంకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే 'మన్మధుడు 2' చిత్రాన్ని ఫైనల్ చేశాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. ఒక వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఒక హిందీ ఒక తమిళం ఒక మలయాళ సినిమాకు నాగార్జున ఓకే చెప్పాడంటూ వార్తలు వచ్చాయి.నాగార్జున హిందీ మూవీ 'బ్రహ్మాస్త్ర'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఇక తమిళంలో ధనుష్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే రూపొందాల్సిన 'రుద్ర' చిత్రంలో కూడా నాగార్జున ఒక పాత్రకు ఎంపిక అయ్యాడు. కాని ఆ సినిమా బడ్జెట్ ఇష్యూ కారణంగా ఆగిపోయింది. ఇక మలయాళ ప్రతిష్టాత్మక మూవీ 'మరక్కార్' లో కూడా నాగార్జునను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సభ్యులు కూడా నాగార్జున ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా అనధికారికంగా చెప్పుకొచ్చారు. కాని తాజాగా ఈ ప్రతిష్టాత్మక మలయాళ చిత్రంలో నాగార్జున ఉండా లేడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

'మరక్కార్' మూవీ పట్టాలెక్కి చాలా రోజులు అయ్యింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే షూటింగ్ లో ఇప్పటి వరకు నాగార్జున పాల్గొన్నది లేదు. సినిమాకు సంబంధించిన పలు ఆన్ లొకేషన్స్ పిక్స్ బయటకు వచ్చాయి. కాని ఒక్కదాంట్లో కూడా నాగార్జున కనిపించలేదు. తాజాగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా వీర జవాన్ లకు సంతాప సూచకంగా క్యాండిల్ ప్రదర్శణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మోహన్ లాల్ అర్జున్ ఇంకా చిత్రంలో నటిస్తున్న నటీనటులు కనిపించారు. కాని నాగార్జున మాత్రం లేడు. దాంతో మరక్కార్ లో నాగార్జున ఉన్నాడా లేడా అనే అనుమానాలు మరింతగా వస్తున్నాయి. మరి ఈ విషయమై నాగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.