బాలయ్యపై నాగబాబు సెన్సేషనల్ వీడియో

Mon Dec 10 2018 14:14:29 GMT+0530 (IST)

తనకు బాలయ్య ఎవరో తెలియదంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ గురించి అడిగితే.. ఒకప్పటి సీనియర్ నటుడు బాలయ్య గురించి ప్రస్తావించి సెటైర్లు వేశాడు నాగబాబు ఆ ఇంటర్వ్యూలో. ఐతే ఈ వ్యాఖ్యల్ని తాను వెనక్కి తీసుకుంటున్నానంటూ నాగబాబు తాజాగా ఒక వీడియోతో మళ్లీ జనాల ముందుకు వచ్చారు. ఈ వీడియో మొదలైన తీరు చూసి జనాలు ఏదో అనుకున్నారు. తన వ్యాఖ్యల పట్ల నాగబాబు విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపించాడు. కానీ అసలు ట్విస్టు తర్వాత వెల్లడైంది. బాలయ్యకు.. బాలయ్య అభిమానులకు మంట పుట్టించేలా పెద్ద షాకే ఇచ్చాడు నాగబాబు తర్వాత.బాలయ్య తెలియదన్న తన వ్యాఖ్యలకు కొంతమంది బాధ పడ్డారని తన మిత్రుల ద్వారా తర్వాత తెలిసిందని.. ఇది తప్పు కదా అని తనతో అన్నారని.. తన వ్యాఖ్యలు తప్పే అని నాగబాబు అన్నాడు. బాలయ్య తెలియకపోవడం ఏంటి.. ఆయన పెద్ద కమెడియన్ కదా అంటూ తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు నాగబాబు. బాలయ్య ఏంటి.. ఆయన కమెడియన్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. బాలయ్య అంత కామెడీ చేసేవాళ్లు అరుదుగా ఉంటారని.. ఆంగికాభినయాల కానీ.. పెర్ఫామెన్స్ కానీ చాలా బాగుంటుందని.. ఆయన కడుపుబ్బ నవ్విస్తారని.. నందమూరి తారక రామారావుతో కూడా కలిసి నటించిన గ్రేట్ కమెడియన్ బాలయ్య అని చెబుతూ.. అలాంటి నటుడిని మరిచిపోయాననడం  తన మిస్టేకే అని చెప్పాడు నాగబాబు. చివరగా.. ఒకప్పటి కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫొటో తీసి.. ఈయనే తాను చెప్పిన గ్రేట్ కమెడియన్ అన్నాడు నాగబాబు. ఈ వీడియో అదిరిందంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తుంటే.. నందమూరి అభిమానులు మాత్రం మంటెత్తిపోతున్నారు. ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణాన మెగా-నందమూరి అభిమానుల్లో.. జనసేన-తెలుగుదేశం మద్దతుదారుల్లో ఈ వీడియో పెద్ద రచ్చకే దారి తీసేలా ఉంది.