Begin typing your search above and press return to search.

‘జబర్దస్త్’లో నాగబాబు ఉగ్రరూపం

By:  Tupaki Desk   |   27 March 2017 4:48 AM GMT
‘జబర్దస్త్’లో నాగబాబు ఉగ్రరూపం
X
ఏడాదిన్నర కిందట మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులపై మెగా బ్రదర్ నాగబాబు ఉగ్రరూపం చూశాం. ఆ తర్వాత మూడు నెలల కిందట ‘ఖైదీ నెంబర్ 150’ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ రామ్ గోపాల్ వర్మ.. యండమూరి వీరేంద్ర నాథ్ ల మీద విరుచుకుపడ్డాడు నాగబాబు. తాజాగా ఆయన ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో సైతం నాగబాబు తన యాంగ్రీ యాంగిల్ చూపించారు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాం అనగానే నాగబాబు నవ్వు మాత్రమే గుర్తుకొస్తుంటుంది. ఈ ప్రోగ్రాంలో ఎప్పుడూ నవ్వుతూ.. సరదాగా కనిపిస్తుంటాడాయన. కానీ ఆయనకు అనుకోకుండా కోపం వచ్చింది.

‘జబర్దస్త్’ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ టీంకు ఉన్న పాపులారిటీ ఏంటో తెలిసిందే. ఈ షోలో ఈ టీం వేసిన ఎన్నో స్కిట్లు భలేగా పేలాయి. ఐతే ఈ మధ్య వీళ్ల స్కిట్లు అంతగా నవ్వించట్లేదు. అవి రొటీన్ అయిపోతున్నాయి. తాజాగా వేసిన ఒక స్కిట్ మరీ రొటీన్ గా ఉండటంతో నాగబాబుకు కోపం వచ్చేసింది. మీకు ఇగో.. పొగరు బాగా ఎక్కువైపోయాయి. ఇదొక స్కిట్టా అంటూ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. తర్వాత రోజా కూడా అందుకుని ఎప్పుడూ ఇదే కాన్సెప్టా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనికి బదులుగా టీం సభ్యులు.. ఐతే మీరు చేయండి అంటూ వెటకారంగా అన్నారు. దీంతో నాగబాబుకు కోపం వచ్చేసింది. హద్దులు దాటి మాట్లాడుతున్నావ్ శీనూ.. అనడమే కాక.. ముందు మీరందరూ నా ఐ సైట్ నుంచి బయటికెళ్లండి అంటూ గట్టి హెచ్చరికే చేశారు నాగబాబు. ఈ స్కిట్ వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో కట్ చేసి ముందే వదిలారు. గతంలో ప్రోగ్రాం మధ్యలో ఇలాంటి వివాదాలేమైనా తలెత్తితే.. వాటిని కట్ చేసి పడేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివే ప్రోమోలుగా కట్ చేసి వదలడం.. జనాల్లో ఇంకా క్యూరియాసిటీ పెంచడం మామూలైపోతోంది. ఇలాంటివి ప్రి ప్లాన్డ్ గా చేస్తారని కూడా అంటారు. నాగబాబు ఆగ్రహం నాటకీయమో కాదో కానీ.. ఈ ప్రోమో మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/