Begin typing your search above and press return to search.

చైతూ ఆశ‌లు నెర‌వేరేనా?!

By:  Tupaki Desk   |   30 Aug 2015 4:23 AM GMT
చైతూ ఆశ‌లు నెర‌వేరేనా?!
X
ప్రేమ‌క‌థ‌ల‌కు త‌గ్గ క‌థానాయ‌కుడిగా నాగ‌చైత‌న్య‌కి గుర్తింపొచ్చిందంటే కార‌ణం గౌత‌మ్ మీన‌న్‌. ఆయ‌న తీసిన `ఏమాయ చేసావె`తోనే చైతూకి బ్రేక్ వ‌చ్చింది. అప్ప‌ట్నుంచి ద‌ర్శ‌కులంతా నాగ‌చైత‌న్య‌ని ల‌వ‌ర్‌ బోయ్‌ గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ప్రేక్ష‌కులు కూడా ఆయ‌న‌లో నేటి జన‌రేష‌న్‌ కి త‌గ్గ మంచి ల‌వ‌ర్ బోయ్ ఉన్నాడ‌ని న‌మ్ముతున్నారు. ఏమాయ చేసావెకి ముందు నాగ‌చైత‌న్య‌కి ఏ సినిమా కూడా అచ్చి రాలేదు. అస‌లు తెర‌పై ఎలా క‌నిపిస్తే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతానో అన్న డైల‌మా ఆయ‌న‌లో క‌నిపించేది. ఆ స‌మ‌యంలోనే గౌత‌మ్ మీన‌న్ `ఏమాయ చేసావె` తీశాడు. నేచుర‌ల్ అప్రోచ్‌ తో చైతూని తెరపై చూపించిన విధానం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. దీంతో చైతూ తొలి హిట్టు కొట్టేశాడు. ఆ త‌ర్వాత 100%ల‌వ్‌, త‌డాఖా, ఒక లైలా కోసం లాంటి హిట్లొచ్చాయి.

అయితే నాగార్జున‌లాంటి స్టార్ క‌థానాయ‌కుడి త‌న‌యుడు ల‌వ‌ర్‌ బోయ్ ఇమేజ్‌ కే ప‌రిమిత‌మైపోతే ఏం బాగుంటుంది. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా యాక్ష‌న్ క‌థ‌ల‌కీ స‌రిపోవాలి క‌దా! అందుకే నాగ‌చైత‌న్య కొంత‌కాలంగా యాక్ష‌న్ ఇమేజ్‌ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. `ద‌డ‌`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`లాంటి సినిమాలు చేశాడు కానీ క‌లిసి రాలేదు. ఇప్పుడు మాత్రం త‌నకి ల‌వ‌ర్‌ బోయ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన గౌత‌మ్‌ మీన‌నే యాక్ష‌న్ ఇమేజ్ కూడా తెచ్చిపెడ‌తాడ‌న్న న‌మ్మ‌కంతో నాగ‌చైత‌న్య క‌నిపిస్తున్నారు. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహ‌సం శ్వాస‌గా సాగిపో` అనే చిత్రం చేస్తున్నాడు చైతూ. ఇందులో ఫ‌స్ట్ పార్టంతా ప్రేమ‌క‌థేన‌ట‌. సెకండ్ పార్ట్ మాత్రం యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ తో సాగుతుంద‌ట‌. అటు ప్రేమ‌క‌థ‌ల‌తోనూ, ఇటు యాక్ష‌న్ క‌థ‌ల‌తోనూ నిరూపించుకొన్న గౌత‌మ్‌ మీన‌న్ మ‌ళ్లీ నాతో సినిమా తీయ‌డం, ఆ సినిమాలో రెండు పార్ట్‌ లు మిక్స్ అవ్వ‌డం నా అదృష్టం అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ సినిమాతో యాక్ష‌న్ ఇమేజ్ వ‌చ్చి తీరుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్నాడు. ఇందులో యాక్ష‌న్ ఉంద‌నీ, చూడండ‌నీ ప్రేక్ష‌కుల్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌లో యాక్ష‌న్‌ కి సంబంధించిన షాట్‌ ల‌ని కూడా ప‌ట్టుబ‌ట్టి విడుద‌ల చేయించాడు చైతూ. ఈ సినిమా హిట్ట‌యితే ఇక ద‌ర్శ‌కులు త‌న‌కోసం కూడా యాక్ష‌న్ క‌థ‌ల్ని సిద్ధం చేస్తార‌ని చైతూ న‌మ్ముతున్నాడు. మ‌రి ఆయ‌న ఆశ‌లు తీరుతాయో లేదో చూడాలి.