చైతు మొదటిసారి అలా

Thu Apr 25 2019 14:34:59 GMT+0530 (IST)

మజిలీ సక్సెస్ తో ఏడాది ఎదురు చూపులకు బ్రేక్ వేసుకున్న నాగ చైతన్య అదే ఉత్సాహంతో వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా మహా సముద్రం ఆల్మోస్ట్ ఓకే చేసినట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. హీరొయిన్ గా సమంతానే ట్రై చేస్తున్నట్టు మరో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇందులో చైతు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.చైతు ఇలాంటి రోల్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో సునీల్ తో కలిసి చేసిన తడాఖాలో అలాంటి ఛాయలు ఉన్న పాత్ర చేసాడు నిజానికి అది పరిగణనలోకి రాదు. సో ఇదే ఫస్ట్ అవుతుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశాన్ని తీసుకుని అజయ్ భూపతి సీరియస్ నెరేషన్ లో దీన్ని విభిన్నంగా రాసుకున్నట్టు టాక్. అక్కినేని హీరోలలో నాగార్జున ఐపిఎస్ గా చేసిన రక్షణ-శివమణి-నిర్ణయం లాంటివి మంచి విజయం అందుకున్నాయి. ఏఎన్ ఆర్ గారు అలాంటివి ఎన్నో చేశారు. సుమంత్ కూడా విజయ్ ఐపిఎస్ అని ఓ సినిమా చేశాడు. ఇప్పుడు చైతు వంతు వచ్చింది.

అజయ్ భూపతి ఈ స్క్రిప్ట్ మీదే గత ఏడాది కాలంగా వర్క్ చేస్తున్నాడు. హీరో హీరొయిన్ కాంబో సెట్ కావడంతో కొంత ఆలస్యం జరగడంతో సెట్స్ పైకి అనుకున్న టైంకు వెళ్ళలేకపోయింది. ఇందులో హీరొయిన్ పేరు మహా. వైజాగ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సముద్రం అని పెట్టారు. మహా ప్రేమ కోసం పోరాడుతూనే సముద్రాన్ని దోచుకుంటున్న మాఫియా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హీరో కథగా దీని గురించి టాక్ ఉంది. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది