Begin typing your search above and press return to search.

చైతూ.. ఏం చేస్తాడు పాపం?

By:  Tupaki Desk   |   11 Sep 2017 3:36 PM GMT
చైతూ.. ఏం చేస్తాడు పాపం?
X
అక్కినేని నాగచైతన్య మరోసారి గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు. ‘యుద్ధం శరణం’ డిజాస్టర్ అని తేలిపోయింది. తొలి రోజు సాయంత్రానికే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోవడంతో సినిమా కలెక్షన్లు పడిపోయాయి. వీకెండ్లోనే ఈ సినిమా వీక్ అయిపోయింది. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు రూ.4 కోట్లు దాటాయంతే. వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

ప్రేమమ్.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత చైతూ నటించిన సినిమాకు ఇలాంటి ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ సినిమాల ద్వారా నాగచైతన్య ఇమేజ్ ఏం పెరిగిందన్న ప్రశ్న తలెత్తుతోందిప్పుడు. చైతూకు మొదట్నుంచి ఉన్న ఇబ్బంది ఇదే. ప్రేమకథల నేపథ్యంలో ఏమాయ చేసావె.. 100 పర్సంట్ లవ్.. మనం.. ప్రేమమ్.. రారండోయ్ వేడుక చూద్దాం.. ఇలా చాలా విజయాలే ఖాతాలో వేసుకున్నాడు చైతూ. కానీ వీటి వల్ల చైతూకు ఇమేజ్ పరంగా ఒరిగిందేమీ లేదా అన్న సందేహాలు రేకెత్తిస్తున్నాయి అతడి ఫ్లాప్ సినిమాలు.

రెండేళ్ల కిందట ‘దోచేయ్’ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఈ సినిమాకు నెగెటివ్ రావడం ఆలస్యం.. కలెక్షన్లు తొలి రోజే పడిపోయాయి. విడుదలకు ముందు మంచి క్రేజ్ తెచ్చుకున్నా సరే.. ఓపెనింగ్స్ రాలేదు. ఇప్పుడు ‘యుద్ధం శరణం’ విషయంలోనూ అదే జరిగింది. చైతూకు మాస్ ఇమేజ్ లేకపోవడమే దీనికి కారణం. మాస్ ఇమేజ్ ఉంటే.. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు. అందుకే యువ కథానాయకులంతా మాస్ ఇమేజ్ కోసం తహతహలాడిపోతుంటారు.

చైతూ కూడా అప్పుడప్పుడూ ఆ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అతను ఈ ఇమేజ్ కోసం ట్రై చేసిన ప్రతిసారి ఎదురు దెబ్బే తగులుతోంది. కొత్తగా ఇమేజ్ పెరగడం మాటేమో కానీ.. ఉన్న ఇమేజ్ దెబ్బ తింటోంది. ఫెయిల్యూర్లు ఎదురవుతున్నాయి. లవ్ స్టోరీలు అతడికి హిట్లయితే ఇస్తున్నాయి కానీ.. మార్కెట్.. ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రం ఉపయోగపడట్లేదు. ఈ పరిస్థితుల్లో చైతూ భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ నటించనున్న ‘సవ్యసాచి’ ఈ విషయంలో చైతూ కెరీర్ ను మలుపు తిప్పగలదని అంచనా వేస్తున్నారు. అది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రధానంగానూ సాగుతుందని.. ఆ సినిమాతో చైతూ ఆశించిన ఫలితం రావచ్చని భావిస్తున్నారు. మరి ‘సవ్యసాచి’ ఏం చేస్తుందో చూద్దాం.