నాగచైతన్య.. నాలుగు సినిమాలు

Tue Mar 13 2018 16:30:29 GMT+0530 (IST)

వారసత్వంతో అడుగుపెట్టే హీరో.. ఎగ్జిస్టెన్స్ కోసం సొంత బేనర్లో సినిమాలు చేయాల్సిన అవసరం లేకపోతే అతను విజయవంతమైనట్లే. ఈ విషయంలో అక్కినేని నాగచైతన్య తండ్రికి పెద్దగా భారం కాలేదు. కెరీర్ ఆరంభలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత బాగానే నిలదొక్కుకున్నాడు. అతను హీరోగా విజయవంతమయ్యాకే సొంత బేనర్లో సినిమాలు చేశాడు. ఆ సినిమాలు తండ్రికి మంచి లాభాలు కూడా అందించాయి. పెద్ద మాస్ హీరో కాలేకపోయినా.. లవ్ స్టోరీల స్పెషలిస్టుగా పేరొందిన చైతూ ఇప్పుడు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యువ కథానాయకుల్లో ఒకడు. అతడితో సినిమాలు చేయడానికి చాలామంది పోటీ పడుతుండటం విశేషమే.‘మైత్రీ మూవీ మేకర్స్’ లాంటి పెద్ద సంస్థలో చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చేస్తున్న చైతూ.. దీంతో పాటుగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లాంటి మరో ప్రముఖ బేనర్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’లో నటిస్తున్నాడు. ఇటీవలే ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తన భార్య సమంతతో కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయడానికి చైతూ అంగీకరించాడు. ఇవి కాక సొంత బేనర్లో మరో సినిమా కూడా చేయబోతున్నాడు చైతూ. ఒక కొత్త దర్శకుడితో చైతూ సినిమా చేయడానికి కమిటైనట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీదే తెరకెక్కిస్తారట. కెరీర్ ఆరంభంలో కొత్త దర్శకులతో ‘జోష్’.. ‘బెజవాడ’ లాంటి సినిమాలు చేసిన చైతూ.. ఆ తర్వాత డెబ్యూ డైరెక్టర్ల జోలికి వెళ్లలేదు. మళ్లీ ఇంత కాలానికి కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించాడట. ఆ దర్శకుడి పేరు.. ఇతర వివరాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశముంది.