అన్నపూర్ణ స్టూడియోస్..వారసత్వం మారింది!

Mon Jul 16 2018 10:06:28 GMT+0530 (IST)

వారసత్వం రెండు రకాలు. తల్లిదండ్రులను వాడుకునే వారు - తల్లిదండ్రుల వారసత్వాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఎదిగేవాళ్లు. అక్కినేని నాగార్జున - ఆ తర్వాత నాగ చైతన్య ఈ రెండో కోవకు చెందే వారసులే. ఎన్నో గొప్ప సినిమాలు అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ ను అక్కినేని నాగేశ్వరరావు అనంతరం నాగార్జున ఎంతో సమర్థంగా నిర్వహించారు. ఇపుడు అది మూడో తరం చేతికి అందినట్టు తెలుస్తోంది. నాగచైతన్య-సమంత జంట ఆ బాధ్యతలను నెత్తిన వేసుకుని మరింత యాక్టివ్ గా నడిపిస్తున్నారు.అక్కినేని నాగార్జున చేతికి వచ్చాక బ్యానర్ ఎన్నో సినిమాలు నిర్మించింది. సొంత స్టూడియో కలిగిన ఉన్న ఈ బ్యానర్ సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. మొదట్లో  అక్కినేని నాగేశ్వరరావు కుమారులు  వెంకట్ - నాగార్జున ఇద్దరూ కలిసి దీనిని నిర్వహించినా తర్వాత వెంకట్ తప్పుకున్నారు. ఇక అప్పట్నుంచి ఆ బ్యానర్ పై వచ్చే సినిమాలన్నింట్లో నిర్మాతగా సింగిల్ కార్డుగా నాగార్జున పేరు పడింది. అయితే నాగార్జున ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల - అన్నీ తను ఒక్కడే చూసుకునే అవకాశం లేకపోవడం వల్ల బ్యానర్ ను నాగచైతన్య చేతిలో పెట్టినట్లు సమాచారం.

ఇపుడు నాగచైతన్య-సమంత కలిసి బ్యానర్ బాధ్యత - ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నారట. ఇటీవల ఇతర ఔత్సాహికులు నిర్మించిన చి ల సౌ సినిమాను చూసి ఆకర్షితులైన చై-శామ్ జంట తమ బేనర్ కిందకు తెచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. సమంత పేరు బ్యానర్ లో కనిపించకపోవచ్చు గాని బాధ్యతలు మాత్రం పూర్తిగా పంచుకుంటోందామె. అందుకే ఇద్దరూ కలిసి ఈ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు. తమ గ్లామర్ ను - తమ ఫ్యాన్స్ ను ఈ సినిమాకు వాడేస్తున్నారు. వీరి అక్కౌంట్లలో సగం ట్వీట్లు ఆ సినిమా గురించే. అదేంటో... కుటుంబ సినిమాల గురించి ఏదో ఒక కామెంట్ చేసే నాగార్జున ఈ సినిమా గురించి ఇంతవరకు ఒక్కమాటైనా మాట్లాడలేదు.