చైతు కత్తి పట్టింది అందుకే

Sat Aug 11 2018 11:31:06 GMT+0530 (IST)

అక్కినేని వారసుడిగా వరుస సినిమాలతో అభిమానులను పలకరిస్తున్న నాగ చైతన్య కొత్త సినిమా శైలజారెడ్డి అల్లుడు పై మీద భారీ హైప్ ఉంది. టైటిల్ మొదలుకుని ఫస్ట్ లుక్ పోస్టర్స్ దాకా అన్ని మాస్ ని అప్పీల్ చేసేలా ఉండటంతో అభిమానులు కూడా దీని మీద ప్రత్యేక అంచనాలు పెంచుకుంటున్నారు. ఇప్పటి దాకా చేసిన సినిమాల్లో చైతు చేసినవి ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్ రోల్స్. ఒక్క ఆటోనగర్ సూర్యలో మాత్రమే రఫ్ గా కనిపించే లీడర్ పాత్రలో మరిపించాడు. కానీ అది కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో అంతగా గుర్తుండిపోలేదు. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడులో మాస్ అవతారంలో మెప్పించబోతున్నాడు అనే వార్త ఫాన్స్ కి బాగా కిక్ ఇస్తోంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో లీక్ రూపంలో బయటికి వచ్చిన ఒక పోస్టర్ హల్ చల్ చేస్తోంది. అందులో చైతు కొడవలి లాంటి ఆయుధాన్ని చేతిలో పట్టుకుని ఆవేశంతో చూస్తుండగా వెనుక నుంచి ప్రత్యర్థుల గుంపు రావడాన్ని చూస్తే ఇదేదో మంచి మసాలా ఫైట్ లా అనిపించడం సహజం.దీని వెనుక మరో కథ కూడా ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.దాని ప్రకారం చైతు ఇందులో ఫ్యాక్షనిస్ట్ అయిన అత్తయ్య రమ్య కృష్ణ చెప్పిన ఒక క్లిష్టమైన బాధ్యతను నెరవేర్చడం కోసం ఇలా రక్తపాతంలో దిగుతాడట. ఊరికి మంచి చేయటం లక్ష్యంగా పెట్టుకున్న అత్త చెప్పిన పని కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకపోవడం చూసి రమ్య కృష్ణ చైతుని దగ్గర తీసుకుంటుంది. ఇలా చేయడానికి కారణం ఆమె కూతురు  అను ఇమ్మానియేల్ మీద చైతు పెంచుకున్న ప్రేమ అనే పాయింట్ మీద దర్శకుడు మారుతీ అన్ని మసాలాలు సరిపడేలా వేసుకున్నట్టు దాని సమాచారం. ఈ లైన్ లో మరీ కొత్తదనం ఏమి లేకపోయినా ట్రీట్ మెంట్ కనక కరెక్ట్ గా కుదిరితే మాస్ ఆదరించే అంశాలు చాలానే సెట్ చేసుకోవచ్చు. పైన స్టిల్ లో చైతన్య కత్తి పట్టడానికి కారణం అదేగా అనిపిస్తోంది. ఆగస్ట్ 31 విడుదల ప్లాన్ చేసిన  శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్ హంగామా వచ్చే వారం నుంచి మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటికే బేబీ అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేసిన టీమ్ త్వరలో ఆడియో రిలీజ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసే పనిలో ఉంది.