తెలుగు మీడియాపై నాగబాబు సంచలన కామెంట్స్!

Mon Dec 10 2018 11:08:29 GMT+0530 (IST)

మెగా బ్రదర్స్ లో చిరు మినహాయిస్తే.. మిగిలిన ఇద్దరు తమ్ముళ్లు ఫైర్ బ్రాండ్సే.  పవన్ తో సమానంగా చెలరేగిపోయే మరో బ్రదర్ గా నాగబాబును చెప్పాలి. అయితే.. అన్ని సందర్భాల్లో కాకుండా కొన్నిసార్లు ఆయన తన ఆవేశాన్ని బ్లోఔట్ మాదిరి మాటల్లో చూపిస్తారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.  తెలుగు మీడియాపై ఆయన చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.తెలుగు మీడియాను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం అంతో ఇంతో లేకపోలేదు. తమను టార్గెట్ చేసేలా ప్రముఖ మీడియా సంస్థలు వ్యవహరించటం.. తమ ఇమేజ్ ను దెబ్బే తీసేలా కథనాలు ప్రచురించటం.. వాటికి సంబంధించిన వివరణ ఇవ్వకపోవటం లాంటివి ఈ కోవకు చెందినవిగా చెప్పాలి.
తెలుగు మీడియాపై ఇంత ఓపెన్ గా మాట్లాడిన సెలబ్రిటీ ఇప్పటివరకూ ఎవరూ లేరన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటో చూస్తే..

+ సినిమాల్ని వదిలిన పవన్ సీరియస్ గా ప్రజల్లోకి వెళ్లారు. రాజకీయాల వైపు దృష్టి సారించారు. ఇప్పట్లో పవన్ సినిమాలు చేసే అవకాశం లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. తెలుగు మీడియాకు సంబంధించి అందరూ నమ్మే అగ్ర పత్రిక ఒకటి పవన్ వివరణ తీసుకోకుండానే.. ఆయన సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్త ఒకటి అచ్చేసింది.

+  ఈ వార్త వెనుక అసలు ఉద్దేశం ఏమంటే.. పవన్ రాజకీయాల పట్ల అంత సీరియస్ గా లేడు.. సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగేలా చేయటం కోసం. ప్రజల్ని పక్కదారి పట్టించేలా ఇంజెక్ట్ చేయటం కోసమే. ఇవన్నీ ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నవే.

+ ఏదో ఒక ఘటనను పట్టుకొని మొత్తం మీడియాను నిందించటం సరికాదన్న ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టు మాటలకు స్పందించిన నాగబాబు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి.  పవన్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేశ్.. శ్రీరెడ్డి ఎపిసోడ్స్ ను మర్చిపోకూడదు.

+ పవన్ ను దెబ్బ తీసేలా మీడియా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు నిజమే అనుకుంటే.. మరి పవన్ ను ఫోకస్ చేసిన వైనాన్ని మర్చిపోతున్నారే అంటూ అడిగిన ప్రశ్నకు నాగబాబు బదులిస్తూ.. టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చినంత కాలం తెలుగు మీడియా ఆయన్ను సపోర్ట్ చేసింది. మద్దతు విరమించిన వెంటనే పవన్ మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేసిందన్నది మర్చిపోకూడదు.

+ 2018 మార్చి 14 ముందు వరకూ పవన్ ట్వీట్లను ప్రముఖంగా స్క్రోలింగ్స్ ఇచ్చిన మీడియా ఛానల్స్.. ఆ తర్వాత పవన్ గిరిజనులతో.. ఇతర వర్గాలతో రోజుల తరబడి గడిపిన ఉదంతాల్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. వారితో రోజుల తరబడి ఉన్నప్పటికీ ఆ వార్తల్ని ప్రముఖంగా ప్రచురించకపోవటంలో ఉద్దేశం ఏమిటి?

+ తెలుగు మీడియా మొత్తం పవన్ కు వ్యతిరేకంగా ఉన్నా.. సోషల్ మీడియా మాత్రం సపోర్ట్ గా నిలిచింది. సోషల్ మీడియా కానీ లేకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేది. అందుకే తాను సోషల్ మీడియాకు థ్యాంక్స్ చెబుతానన్నారు.

+ తెలుగు మీడియాకు సంబంధించి ఆ మధ్యన కోబ్రా పోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ.. తెలుగు మీడియా మాత్రం ఆ విషయాల్ని పెద్దగా హైలెట్ చేయలేదు. కోబ్రా పోస్ట్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. టీవీ ఛానల్స్ ధన దాహాన్ని బయటపెట్టారు.

+ మీకు మేం డబ్బులిస్తాం. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బ తీసే కథనాల్ని ప్రసారం చేస్తారా? అంటూ రాజకీయ పార్టీ వ్యక్తుల మాదిరి నటిస్తూ ఆయాన టీవీ ఛానల్స్ పెద్దల వద్దకు వెళ్లారు. వీరి ప్రపోజల్ ను అనేక టీవీ ఛానళ్లు ఓకే చెప్పేశాయి. దేశం మొత్తమ్మీదా రెండు సంస్థలు మినహాయించి మిగిలిన ప్రతి ఛానల్ డబ్బుల కోసం ఎంత దుర్మార్గమైన ప్రోగ్రామ్ లు వేసేందుకైనా సై అన్నాయి. ఆ విషయాన్ని కోబ్రో పోస్ట్ వీడియో సాక్ష్యాలతో నిరూపించిన వైనాన్ని మర్చిపోకూడదు.

+ తెలుగులో ప్రముఖ ఛానల్స్ గా ఉండే రెండు ఛానల్స్ ఈ తరహా ఆపరేషన్లో అడ్డంగా దొరికాయి. కోబ్రా పోస్ట్ తమ కథనాల్ని బయటపెట్టిన తర్వాత కూడా ఆ ఛానల్స్ తాము అలా అనలేదంటూ ఖండించే సాహసం చేయటం లేదు. డబ్బు కోసం ఇంత దారుణాలు మీడియా సంస్థలు చేస్తున్నప్పుడు.. అవి స్వచ్ఛంగా పని చేస్తున్నాయని ఎలా అనుకోవాలి?

+ తాను చేసే విమర్శలన్ని మీడియా మీదనే కాని.. మీడియాలో పని చేసే జర్నలిస్టుల మీద కానేకాదు. నేను మాట్లాడుతున్నది మీడియా పెద్దల గురించి మాత్రమే. జర్నలిస్టులు ఆయా మీడియా సంస్థల్లో ఉద్యోగులు మాత్రమే. యాజమాన్యం చెప్పే పాలసీలకు అనుగుణంగా వారు పని చేయాల్సి ఉంటుంది. కానీ.. మీడియా మేనేజ్ మెంట్లు మాత్రం డబ్బుకు కక్కుర్తి పడి కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. అదే తీరులో పని చేస్తున్నాయి.